ఐరాసలో గాజాపై తీర్మానానికి భారత్‌ సానూకూలం

` కాల్పుల విరమణకు అనుకూలంగా ఓటు
` 153 దేశాల మద్దతుతో తీర్మానానికి ఆమోదం
దిల్లీ(జనంసాక్షి): ఇజ్రాయెల్‌` హమాస్‌ మధ్య భీకర పోరుతో గాజాలో సామాన్య పౌరుల బతుకు ఛిద్రమవుతోంది. మరోపక్క హమాస్‌ చెరలో బందీలు బిక్కుబిక్కుమంటున్నారు.దీంతో తక్షణ కాల్పుల విరమణకు, బేషరుతుగా బందీల విడుదలకు డిమాండ్‌ చేస్తూ ఐరాస జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ముసాయిదా తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటేసింది. ఐరాస అత్యవసర ప్రత్యేక సమావేశంలో భాగంగా ఈజిప్టు ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. 193 సభ్యదేశాల్లో 153 దేశాలు అనుకూలంగా ఓటు వేశాయి. 23 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో ఈ తీర్మానానికి ఆమోదం లభించింది.ఈ తీర్మానంపై ఐరాసలోని భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్‌ మాట్లాడారు. ‘జనరల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్‌ అనుకూలంగా ఓటేసింది. అక్టోబర్‌ ఏడున ఇజ్రాయెల్‌పై ఉగ్రదాడి జరిగింది. అప్పుడు హమాస్‌ చెరలో ఉన్న బందీల గురించి తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం గాజాలో అపార ప్రాణనష్టం సంభవిస్తోంది. మహిళలు, చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. దీర్ఘకాలిక పాలస్తీనా సమస్యకు ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని కాంబోజ్‌ వెల్లడిరచారు. అలాగే ఈ తీర్మానానికి ఆమోదం లభించడాన్ని ఆమె స్వాగతించారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సరైన సమతుల్యతను సాధించడమే అసలైన సవాలు అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అక్టోబర్‌లో ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి భారత్‌ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కానీ గాజాలో మానవతా సాయం ఎలాంటి అవాంతరం లేకుండా అందాలని పిలుపునిచ్చింది.మరోపక్క ప్రస్తుత తీర్మానంలో హమాస్‌ దాడి గురించి ప్రస్తావన లేదు. దాంతో అమెరికా ఈ ముసాయిదాకు సవరణను ప్రతిపాదించింది. ఇజ్రాయెల్‌పై హమాస్‌ జరిపిన ఉగ్రదాడిని, పౌరులను తన చెరలో బంధించడాన్ని నిస్సందేహంగా ఖండిస్తున్నామని ఆ ప్రతిపాదనలో పేర్కొంది. ఈ సవరణకు కూడా భారత్‌ అనుకూలంగా ఓటేసింది. కాగా, కొద్దిరోజుల క్రితం గాజాలో తక్షణమే కాల్పులు విరమణ జరగాలని ఐరాస భద్రతా మండలిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి 15 సభ్య దేశాల్లో 13 అనుకూలంగా ఓటేశాయి. అయితే ఈ డిమాండ్‌ను అమెరికా  వ్యతిరేకించింది. తన వీటో పవర్‌ వాడి అడ్డుకున్న సంగతి తెలిసిందే.

 

(హమాస్‌ జలసమాధి చేసేందుకు కుట్ర
` గాజా సొరంగాల్లోకి సముద్రపు నీరు
` ప్రక్రియతో మంచి నీరు దెబ్బతినే ప్రమాదం
గాజా స్ట్రిప్‌(జనంసాక్షి): హమాస్‌ దళాలను గాజా సొరంగాల్లోనే జలసమాధి చేసే వ్యూహాన్ని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ అమలు చేయడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా గాజా మెట్రోగా పిలిచే హమాస్‌ సొరంగాల్లోకి సముద్రపు నీటి విడుదలను మొదలుపెట్టింది.ఈ ప్లాన్‌ తొలి దశలోనే ఉందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి. వీటిల్లో నీరు నింపే ప్రణాళిక పూర్తికావడానికి కొన్ని వారాల సమయం పడుతుందని అంచనావేస్తున్నారు. ఈ దెబ్బకు హమాస్‌ దళాలు నక్కిన ఛాంబర్లు, బందీలను దాచిన ప్రదేశాలు, ఆయుధాగారాలు పూర్తిగా ధ్వంసమైపోతాయని భావిస్తున్నారు. కాకపోతే గాజాలోకి వచ్చి చేరే సముద్రపు నీరు కారణంగా ఇక్కడి మంచి నీటి వనరులు దెబ్బతింటాయనే అందోళనలు ఉన్నాయి.ఇజ్రాయెల్‌ దళాలు ఈ సొరంగాలను దెబ్బతీయడానికి భారీగా బంకర్‌ విధ్వంసక బాంబుల వినియోగం, రసాయన ద్రవాల వినియోగం, శునకాలను, రోబోలను, డ్రోన్లను పంపడం వంటి అప్షన్లను పరిశీలించాయి. తాజాగా ఐడీఎఫ్‌ చీఫ్‌ హెర్జీ హల్వీ మాట్లాడుతూ సొరంగాలను నీటితో నింపడం మంచి వ్యూహం అని వ్యాఖ్యానించారు. అంతకు మించి వివరాలు వెల్లడిరచేందుకు నిరాకరించారు. ఇప్పటికే ఐదు భారీ పంపులను గాజా వద్దకు తరలించినట్లు కథనాలొచ్చాయి.మరోవైపు ఈ వ్యూహంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ స్పందిస్తూ ‘’ఆ సొరంగాల్లో బందీలెవరూ లేరనే వాదనలు ఉన్నాయి. కానీ, నేను దానిని ధ్రువీకరించలేను. ప్రతి పౌరుడి మరణం విషాదకరమే. ఇజ్రాయెల్‌ మాటలకు చేతలకు పొంతన ఉండాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు.గాజా నుంచి ఈజిప్ట్‌లోకి సొరంగాలు తవ్వడం ఇక్కడి వ్యాపారులకు పరిపాటి. 2015లో గాజాపట్టీ`సినాయ్‌ ద్వీపకల్పం మధ్య సొరంగాలను ధ్వంసం చేసేందుకు ఈజిప్ట్‌ సైన్యం మధ్యధరా సముద్రం నీటిని వీటిల్లోకి వదిలింది. గాజా సరిహద్దుల్లోని సుమారు 14 కిలోవిూటర్ల మేర భారీ పైపులతో నీటిని పంప్‌ చేశారు. ఆ తర్వాత ఈ సముద్ర నీటిని చేపల పెంపకానికి వాడారు. ఈ చర్యను అప్పట్లో చాలా పాలస్తీనా గ్రూపులు తీవ్రంగా ఖండిరచాయి. కానీ, ఆ ప్రాంతంలోని నేల దెబ్బతిందన్న ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ చర్య లక్షల మంది పాలస్తీనా వాసుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపినట్లు 2016లో ఓ నివేదిక పేర్కొంది. తాము ఇజ్రాయెల్‌ అభ్యర్థన మేరకే ఈ నిర్ణయం తీసుకొన్నట్లు ఈజిప్ట్‌ అధ్యక్షుడు సిసి అప్పట్లో తెలిపారు.