ఐరాస మాజీ సెక్రటరీ జనరల్ అన్నన్ కన్నుమూత
– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి
– అన్నన్ మృతికి ప్రముఖుల నివాళి
స్విట్జర్లాండ్, ఆగస్టు18(జనం సాక్షి) : ఐక్యరాజ్య సమితి మాజీ సెక్రటరీ జనరల్, నోబెల్ శాంతి బహుమతి పురస్కార గ్రహీత కోఫీ అన్నన్ కన్నుమూశారు. శనివారం ఉదయం అస్వస్థతకు గురైన అన్నన్ను ఆయన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఆఫ్రికా ఖండం నుంచి ఐరాసకు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొట్టమొదటి నల్లజాతీయుడు. జనవరి 1, 1997 నుంచి డిసెంబరు 31, 2006 వరకూ పదేళ్ళపాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఘనాలోని కుమాసిలో జన్మించిన అన్నన్ అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించారు. 1961లో డిగ్రీ, 1972లో మేనేజ్మెంట్ లో మాస్టర్స్ డిగ్రీ పూర్తిచేశారు. 1962లో బడ్జెట్ అధికారిగా అన్నన్ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశించారు. 1987-92 కాలంలో సహాయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1997లో తొలిసారి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శిగా బౌత్రోస్ బౌత్రోస్ ఘలీ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కాగా అన్నన్ మృతికి పలు దేశాల ప్రతినిధులు నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.