ఒకేసారి రైతులకు రుణమాఫీ

– అన్నదాతకు మేలుచేయడమే బాబు ధ్యేయం
– ఏపీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి
విజయవాడ, జనవరి22(జ‌నంసాక్షి) : రైతు రుణమాఫీ రెండు విడతలూ ఒకేసారి ఇచ్చేస్తామని మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.. రైతు రుణమాఫీ నిమిత్తం రూ.8వేల కోట్లకుపైగా నిధులు అవసరమన్నారు. ఇన్‌ఫుట్‌ సబ్సిడీ కింద రూ.2వేల కోట్లను రైతుల కోసం ఖర్చు పెట్టనున్నామన్నారు. రైతులకు మరింత మేలు చేకూర్చేందుకు సిద్దంగా ఉన్నామని అన్నారు. నిధుల కొరత వెంటాడుతున్నా రైతులకు మరిన్ని మేళ్లు చేకూర్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. రైతుల అభ్యున్నతే  లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగుతుందని అన్నారు. ఇప్పటికే పలు ప్రాజెక్టులను పూర్తిచేసి వేలాది హెక్టార్లకు సాగునీరు అందించటం జరుగుతుందని తెలిపారు. ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు త్వరలో పూర్తవుతుందని, ఈ ప్రాజెక్టు పూర్తయితే రాబోయే కాలంలో ప్రతీ ఎకరాకు సాగునీరు అందుతుందన్నారు. తద్వారా రైతుల కష్టాలు తొలుగుతాయన్నారు. రాష్ట్రాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్ని రంగాల్లో స్వయం కృషితో అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. ఏపీని ఆదుకుంటామని చెప్పిన కేంద్రం, ఆమేరకు ఏపీకి రావాల్సిన నిధులు అమలు చేయకుండా, ఏపీపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. రాజంపేట నియోజకవర్గం వ్యవహరంపై చంద్రబాబుతో చర్చిస్తామని సోమిరెడ్డి వివరించారు. సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే మేడాకూ సమాచారం అందించినట్లు చెప్పారు.జమ్మలమడుగు విషయంలో చంద్రబాబు ఆదేశాలను పాటించేందుకు మంత్రి ఆది, ఎమ్మెల్సీ రామసుబ్బా రెడ్డిలు కట్టుబడి ఉంటారని మంత్రి చంద్రమోహన్‌ రెడ్డి తేల్చి చెప్పారు.