ఒక్క జోక్‌ 32మంది ప్రాణాలను బలి తీసుకుంది

పగలబడి నవ్వుతండగా డ్రైవర్‌ వెనక్కి చూడడంతోనే ప్రమాదం

బస్సు ప్రమాదంలో బయటపడ్డ సావంత్‌ సంచలన నిజాలు వెల్లడి

ముంబయి,జూలై31(జ‌నం సాక్షి ): ఇటీవల మహారాష్ట్రలో జరిగిన బస్సు ప్రమాదం వెనక ఓ జోక్‌ కారణమని తేలింది. బతికి బయటపడ్డ వ్యక్తి అసలు విషయం చెప్పాడు. జోక్‌ వేయగా అందరూ నవ్వుల్లో మునిగి పోగా డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూడడంతొ బస్సు లోయలో పడిపోయిందన్న వాస్తవం వెల్లడయ్యింది. బస్సులో ఓ ప్రయాణికుడు వేసిన జోకు కారణంగా 32 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. సతారా జిల్లాలో విహారయాత్ర నిమిత్తం 34 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 33 మంది అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సుమారు 800 అడుగుల లోతులో పడటంతో బస్సు నుజ్జునుజ్జయింది. బస్సు లోయలో పడేముందే అప్రమత్తమైన ప్రకాశ్‌ సావంత్‌ దేశాయ్‌ అనే వ్యక్తి అందులోంచి బయటకు దూకి ప్రాణాలు దక్కించుకున్నాడు. అతను దుర్ఘటనకు ముందు జరిగిన విషయాలను విూడియాకు వెల్లడించాడు. బస్సును మళ్లించేటప్పుడు అదుపుతప్పి లోయలో పడిందని వార్తలు వచ్చాయి కానీ ప్రమాదం జరగడానికి అసలు కారణం ప్రకాశ్‌ సావంత్‌ విూడియా ద్వారా వెల్లడించారు. బస్సులోని ఓ ప్రయాణికుడు వేసిన జోకు వల్ల అందరూ గట్టిగా నవ్వుకుంటుండగా డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూశాడట. అదే నిమిషంలో బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయినట్లు తెలిపారు.

‘నేను డ్రైవర్‌ క్యాబిన్‌ వద్ద కూర్చున్నాను. మిగతా ప్రయాణికులు గట్టిగా నవ్వుకుంటుండడంతో డ్రైవర్‌ వెనక్కి తిరిగి చూశాడు. అదే సమయంలో బస్సు అదుపు తప్పింది. లోయలో పడబోతుండగా విండ్‌ షీల్డ్‌ (ముందుండే అద్దం) ఊడిపోయింది. దాంతో అప్రమత్తమై నేను దూకేశాను. పడిపోకుండా చెట్టు కొమ్మను పట్టుకున్నాను. ఆ లోపే బస్సు బండరాయిని తాకి.. ఆ తర్వాత 15 అడుగుల లోతులో ఉన్న చెట్టును ఢీకొని పూర్తిగా కిందపడిపోయింది. బస్సు బండరాయిని తగిలినప్పుడే సగానికి పైగా ప్రాణాలు కోల్పోయి ఉంటారు. భారీ శబ్దం వచ్చింది. నాతో పాటు విహారయాత్రకు వచ్చిన వారి ప్రాణాలు నా ముందే గాల్లో కలిసిపోతుంటే గుండె తరుక్కుపోయింది. ఆ తర్వాత చెట్టు కొమ్మ సాయంతో పైకి ఎక్కి రోడ్డు విూదకు రాగలిగాను. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వ్యక్తిని ఫోన్‌ అడిగి నా తోటి ఉద్యోగికి ఫోన్‌ చేసి జరిగినదంతా చెప్పాను. ఆ తర్వాత రాయ్‌గఢ్‌ పోలీసులకు సమాచారం అందించాం.’ అని వెల్లడించారు.అయితే బస్సు ప్రయాణిస్తున్న ప్రాంతంలో క్రాష్‌ బ్యారియర్లు లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని పర్‌ఫెక్ట్‌ కండిషన్‌లో ఉందని తెలిపారు. మృతదేహాలను ట్రెక్కింగ్‌ రోప్స్‌ సాయంతో బయటకు తీసుకొచ్చారు.