ఒత్తిడితో ఓటమిపాలయ్యాం: ధోనీ

సిడ్నీ: ప్రపంచ కప్ సెమీ ఫైనల్ మ్యాచ్లో ఒత్తిడిని అధిగమించలేకపో్యామని టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆస్ట్రేలియాతో ఓటమి అనంతరం ధోనీ మాట్లాడుతూ.. ఈ మ్యాచ్లో స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయామని అంగీకరించాడు. ఛేజింగ్లో భారత ఓపెనర్లు శుభారంభం అందించినా సద్వినియోగం చేసుకోలేకపోయామన్నాడు. వెంటవెంటనే కీలక వికెట్లు కోల్పోవడం ప్రతికూల ప్రభావం చూపిందని ధోనీ చెప్పాడు. తాను కూడా పూర్తి స్థాయిలో రాణించలేకపోయానని అన్నాడు. ‘నీకిదే ఆఖరి ప్రపంచ కప్’ అన్న ప్రశ్నకు.. తన వయసు 33 ఏళ్లని, వచ్చే ఏడాది జరిగే టీ-20 ప్రపంచ కప్లో ఆడుతానని, ఆ తర్వాత ఫిట్నెస్ను బట్టి 2019 ప్రపంచ కప్లో ఆడాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకుంటానని ధోనీ అన్నాడు.