ఒబామాను బూతుమాటతో తిట్టి..
వియంతియేన్, లావోస్: అగ్రరాజ్యాధినేత బరాక్ ఒబామాపై ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డుటెర్టీ నోరుపారేసుకున్నారు. ఆయనపై విమర్శలు చేయడమే గాక, అసభ్య పదజాలంతో నిందించారు. విషయం తెలుసుకున్న ఒబామా.. రొడ్రిగోతో జరగాల్సిన తొలి సమావేశాన్ని రద్దు చేసుకున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై రొడ్రిగో పశ్చాత్తాపపడ్డారు. అసలేం జరిగిందంటే..
రొడ్రిగో ఇటీవలే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. డ్రగ్స్ మాఫియాపై కఠినంగా వ్యవహరించడమేగాక, ఆ వ్యాపారాన్ని అంతమొందించేందుకు పలు సందర్భాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. తాజాగా.. అమెరికా అధ్యక్షుడు ఒబామాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఒబామాతో సమావేశానికి ఒక రోజు ముందు ఆయనపై విమర్శలు చేయడమేగాక, అసభ్య పదజాలంలో నిందించారు. దీంతో ఒబామా తన సమావేశాన్ని రద్దు చేసుకున్నారు.
ప్రణాళిక ప్రకారం, లావోస్‌లో జరిగే దక్షిణాసియా నేతల సదస్సులో ఒబామా.. రొడ్రిగో మంగళవారం సమావేశం కావాల్సి ఉంది. అయితే తమ అధికారుల ద్వారా రొడ్రిగో వ్యాఖ్యల గురించి తెలుసుకున్న ఒబామా తన భేటీని రద్దు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలపై ఫిలిప్పీన్స్ అధికారులతో మాట్లాడి, నిజం తెలుసుకోవాలని తన సన్నిహిత అధికారులకు తెలిపినట్లు ఒబామా చెప్పారు. అయితే అనుచిత వ్యాఖ్యలపై రొడ్రిగో పశ్చాత్తాపం వ్యక్తం చేసినట్లు ఫిలిప్పీన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మీడియా ప్రశ్నలతో ఒత్తిడికి గురై ఆ వ్యాఖ్యలు చేశారని, అందుకు చింతిస్తున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.