ఓగులాపూర్ లో స్వాతంత్ర సమరయోధుడికి ఘన సన్మానం …
తెలంగాణ సాయుధ పోరాట జ్ఞాపకాలను గుర్తుచేసిన రాజిరెడ్డి..
జనంసాక్షి/చిగురుమామిడి- సెప్టెంబర్ 18:కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ఓగులాపూర్ గ్రామానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు బద్దం పెద్ద రాజిరెడ్డిని గ్రామస్తులు ఆదివారం శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. తెలంగాణ విమోచన వజ్రోత్సవాల సందర్భంగా గ్రామస్తులు రాజిరెడ్డిని సన్మానించగా తెలంగాణ సాయిధ పోరాటంలో జరిగిన జ్ఞాపకాలను గ్రామస్తులకు, యువకులకు వివరించారు. అనభేరి ప్రభాకర్ రావు దళంలో చేరి మహ్మదాపూర్ లో నాటి రజాకార్లతో జరిగిన ఎన్కౌంటర్ కు రాజిరెడ్డి ప్రత్యక్ష సాక్షిగా ఉన్నట్లు పేర్కొన్నారు.సాయిధ పోరాటంలో ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ మీద దాడి చేయడం,ఆయుధాల అపహరణ చేసి పొలంపల్లి కల్లు వ్యాన్లను తగలబెట్టడం,కృష్ణారెడ్డి భూస్వాములు ఇచ్చిన ఆస్తి కాగితాలను తగలబెట్టి రేకొండ బొమ్మనపల్లి మీదుగా మహ్మదాపూర్ గుట్టలకు చేరుకొని భోజనములు చేస్తుండగా రజాకార్ల తమపై దాడి చేయడం, ఆయుధాలు కాల్పులు జరుపుకుంటూ పోగా దళ సభ్యులందరూ చెల్లాచెదురై అందులో 12మంది మరణించినట్లు తెలిపారు.ఆ కాల్పుల్లో ఓగులాపూర్ గ్రామస్తులు ముసుకు చొక్కా రెడ్డి,ఏలేటి మల్లారెడ్డి, కొండ రవి మృతి చెందినట్లు వివరించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది బద్దం నరసింహారెడ్డి,గడ్డం రాజిరెడ్డి, బద్దం మాధవరెడ్డి,కవ్వంపల్లి రవి, సంతోష్,తిరుపతి, బద్దం రామ్ రెడ్డి,గ్రామస్తులు,యువకులు పాల్గొన్నారు.