ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు కు తావు లేదు.

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

వనపర్తి బ్యూరో సెప్టెంబర్25 (జనంసాక్షి)

తుది ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. సోమవారం సాయంత్రం ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ హైదరాబాద్ నుండి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో వనపర్తి జిల్లా నుండి కలెక్టర్ తేజస్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ వనపర్తి జిల్లాలో తుది ఓటర్ జాబితా విడుదలకు ముందు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు, క్రాస్ చెక్ చేసుకుంటున్నట్లు తెలిపారు. కొత్తగా ఓటరు నమోదుకు వచ్చిన ఫారం 6, డిలిషన్, మార్పు చేర్పులకు ఫారం 7,8 లను క్షేత్రస్థాయిలో బి.ఎల్. ఒ లద్వరా పరిశీలించడమే కాకుండా ఎ. ఈ ఆర్. ఓ, ఈ. ఆర్ ఓ, స్థాయిలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి పరిష్కరించడం జరుగుతుందన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ లో ఎన్నికల కమిషన్ ద్వారా ఓటరు జాబితాను 2018 నుండి ఇప్పటి వరకు చేపట్టిన ఎస్.ఎస్. ఆర్ ల వారీగా క్రాస్ చెక్ చేసుకోవటం, దివ్యంగులు, ట్రాన్స్ జెండర్ లు, నూతన ఓటర్ల నమోదు గణాంకాలు ఏ విధంగా క్రాస్ చెక్ చేసుకోవాలి అనేది పి.పి.టి ద్వారా వివరించారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కలిగి ఉండే విధంగా చూసుకోవాలని, వాటిని ముందుగానే క్షేత్రస్థాయిలో పరిశీలించుకోవాలి అని సూచించారు. ఎన్నికల నిర్వహణకు కావలసిన సిబ్బంది, ఫ్లయింగ్ స్క్వాడ్, ఖర్చు పద్దుల నిర్వహణ కమిటీలు, సరిహద్దు చెక్ పోస్ట్ ల ఏర్పాటు తదితర అన్ని అంశాల పై ముందుగానే సన్నద్ధం కావాలని తెలియజేశారు.
హైదరాబాద్ నుండి ప్రధాన ఎన్నికల అధికారితో పాటు అదనపు ఎన్నికల అధికారి సర్ఫారాజ్, రాష్ట్ర నోడల్ అధికారి లోకేష్ కుమార్, వనపర్తి జిల్లా నుండి అదనపు కలెక్టర్ ఎస్. తిరుపతి రావు, సి. సెక్షన్ సుపరిందెంట్ రమేష్, తహశీల్దార్లు, తదితరులు పాల్గొన్నారు.