ఓటింగ్‌కు దూరంగా శివసేన

– బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా మేం ఓటు వేయదల్చుకోలేదు
– తట్టస్థంగానే ఉంటామని పార్టీ సీనియర్‌ నేత సంజయ్‌రావత్‌ వెల్లడి
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : అవిశ్వాస తీర్మానంలో భాగంగా బీజేపీకి తాము ఓటే వేయలేమని, అలాగనీ వ్యతిరేకంగానే ఓటేవేయలేమని శివసేన  తేల్చిచెప్పింది. తాము తటస్థంగా ఉంటామని పేర్కొంది. ఆ పార్టీ పార్లమెంటరీ సమావేశంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ కు దూరంగా ఉండాలని కీలక నిర్ణయం తీసుకుంది. బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము ఓటు వేయలేమని పార్టీ వర్గాలు తెలిపాయి. అవిశ్వాసానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ మేము ఓటు వేయదల్చుకోలేదు. మా పార్టీ అధినేత ఉద్ధవ్‌ థాకరే నిర్ణయం మేరకు మేము తటస్థంగానే ఉంటామని శివసేన సీనియర్‌ నేత సంజయ్‌ రావత్‌ తెలిపారు. బీజేపీతో మా సంబంధాలు కొనసాగించాల్సిన అవసరం మాకు ఉంది. ఎవరిపైన అయినా గౌరవం లేనప్పుడు ఎవరైనా పక్కకు తప్పుకోవడమే మంచిదని పేర్కొన్నాడు. శివసేన పార్టీకు మొత్తం 18 మంది ఎంపీలు ఉన్నారని ఏదైనా నిర్ణయం తీసుకుంటే సంక్షోభం ఖాయమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.
లోక్‌సభ నుంచి బీజేడీ వాకౌట్‌…
విశ్వాస తీర్మానంపై ఎలాంటి చర్చ జరుగుతుందో చూసేందుకు దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమయంలో అవిశ్వాస తీర్మానం ప్రారంభం కాకముందే సభ నుంచి బీజేడీ వాకౌట్‌ చేసింది.. ఒడిశాకు జరిగే అన్యాయంపై ఏ ప్రభుత్వమూ పట్టించుకోవడంలేదని అందుకే సభ నుంచి వాకౌట్‌ చేస్తున్నట్టు బీజేడీ ప్రకటించింది. ఒడిశాలో బిజూ జనతా దళ్‌ (బీజేడీ) నేత నవీన్‌ పట్నాయక్‌ ముఖ్యమంత్రిగా ఉన్నారు. 20 మంది ఎంపీలున్న బీజేడీ… ఒడిశాకు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే
కేంద్రం దృష్టికి తీసుకొచ్చింది. అయినా పట్టించుకోవడంలేదంటూ లోక్‌సభ నుంచి ఆ పార్టీలు ఎంపీలు వాకౌట్‌ చేశారు.