ఓటిఎస్‌పై ప్రజల్లో తీవ్ర నిరసనలు
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు
బలవంతపు వసూళ్లపై ఎదురుతిరుగుతున్న వైనం
అమరావతి,డిసెంబర్3 (జనంసాక్షి) : ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న వన్‌టైమ్ సెటిల్‌మెంట్ ఓటీఎస్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత పెరుగుతోంది. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంపై మహిళలుల్లో నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. తమ పేరిట ఉన్న ఇళ్లకు తామెందుకు డబ్బులు కట్టాలంటూ వాలంటీర్లను నిలదీస్తున్నారు. వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానాన్ని స్వచ్చంధంగా అమలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా కనిపించడంలేదు. కట్టుకున్న ఇళ్లకు లోన్ కట్టాల్సిందే అంటూ వాలంటీర్లు లబ్దిదారుల పీకలపై కత్తిపెట్టినట్లుగా అడుగుతుండడంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. తమపై అధికారులు చెప్పమన్నదే తాము చెబుతున్నామని వాలంటీర్లు లబ్దిదారుల తో అంటున్నారు. తమపై అధికారులు చేస్తున్న ఒత్తిడితోనే బలవంతం చేస్తున్నారన్నది అర్థమవుతోంది. లబ్దిదారులు ఏ మాత్రం వెరవకుండా ప్రభుత్వ నిర్ణయం సరికాదని వ్యతిరేకిస్తున్నారు. వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జగనన్న శాశ్వత గృహహక్కు పథకంలో భాగంగా లబ్దిదారుల నుంచి రుణ బకాయిల వసూలుకు రోజువారీ లక్ష్యాలు నిర్ణయిస్తున్నారు. కానీ లబ్దిదారుల నుంచి స్పందన ఉండకపోవడంతో కిందిస్థాయి ఉద్యోగులు తమ ఉన్నతాధికారులకు ఏం సమాధానం చెప్పాలో తెలియక సతమతమవుతున్నారు. ఓటీఎస్ పేరుతో 1983 నుంచి 2011 వరకు గృహనిర్మాణ బకాయిలు చెల్లించాలని కొద్దిరోజులుగా అప్పటి లబ్దిదారులకు నోటీసులు జారీ చేస్తున్నారు. గృహనిర్మాణసంస్థ అందజేసిన జాబితా ప్రకారం సచివాలయ వలంటీర్లు అందుబాటులో ఉన్నవారిని గుర్తించి అవసరమైన ధ్రువపత్రాల నకళ్లను తీసుకున్నారు. లబ్దిదారుల్లో కొందరు చనిపోయారు. కొందరు ఇళ్లతో సహా స్థలాలను అమ్ముకోవడం, వారసుల స్వాధీనంలో ఉన్నాయి. అప్పుడు కట్టుకున్న ఇళ్లు ప్రస్తుతం 50 శాతం కూడా లేవు. శిథిలమైపోయి ఉన్నాయి. ఎవరైనా బినావిూ పేర్లతో రుణం పొందారేమోనని అనుమానిస్తున్నారు. గుడిసెలో ఉన్నవారిని సైతం బకాయి కట్టమంటూ ఒత్తిడి తెస్తున్నారు.