ఓటీపీలతో నా ఫోన్‌లో బ్యాటరీ అయిపోతోంది!

– ట్రాయ్‌ ఛైర్మన్‌ శర్మ ట్వీట్‌

న్యూఢిల్లీ, జులై31(జ‌నం సాక్షి ): తన ఆధార్‌ సంఖ్యను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసి తీవ్ర చిక్కుల్లో పడ్డారు భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్‌) ఛైర్మన్‌ ఆర్‌.ఎస్‌.శర్మ. ఆయన ఆధార్‌ కార్డును తప్పుగా ఉపయోగించేందుకు నెటిజన్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఆయన మొబైల్‌ ఫోన్‌కు ఎడతెరిపి లేకుండా ఓటీపీలు వస్తున్నాయట. పదే పదే ఓటీపీల సందేశాలు రావడంతో ఆయన ఫోన్‌ బ్యాటరీ అయిపోతోందని చెబుతూ శర్మ మరో ట్వీట్‌ చేశారు. ‘ఫ్రెండ్స్‌.. చిన్న అభ్యర్థన ఆధార్‌ అథెంటికేషన్‌ రిక్వెస్ట్‌ విఫలం కావడంతో నా ఫోన్‌కు వచ్చే ఓటీపీలో బ్యాటరీ ఖాళీ అయిపోతోంది. నిర్మాణాత్మకమైన చర్చల కోసం నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను. విూరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా దయచేసి నాతో పంచుకోండి’ అంటూ శర్మ గత రాత్రి ట్వీట్‌ చేశారు. తన ఆధార్‌ సంఖ్యను వెల్లడించి, దాని ఆధారంగా ఏం చేస్తారో చేసి చూపించండని శర్మ సవాల్‌ విసరడంతో ఫ్రెంచ్‌కు చెందిన ఎథికల్‌ హ్యాకర్‌ అండర్సన్‌ స్పందించారు. శర్మకు సంబంధించిన ఈమెయిల్‌ ఐడీ, పాన్‌ కార్డు వివరాలు, ఓటరు కార్డు వివరాలు, ఫోన్‌ నెంబర్‌, వాట్సాప్‌ డీపీతో సహా పలు వివరాలను బహిర్గత పరిచారు. ఆయనతో పాటు మరికొందరు హ్యాకర్లు శర్మ బ్యాంకు ఖాతా వివరాలను డీమ్యాట్‌ ఖాతా వివరాలను బహిర్గత పరచడంతో ఆయన ఖాతాకు ఒక్కో రూపాయి చొప్పున హ్యాకర్లు, నెటిజన్లు జమ చేస్తున్నారు. అయితే.. ఆయన వివరాలు అందరికీ తెలుసునని ఆధార్‌ ద్వారా అవి బయటపడలేదని భారత విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ ఉడాయ్‌ కొట్టిపారేసింది. ‘శర్మ మొబైల్‌ నెంబర్‌ నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సెంటర్‌(ఎన్‌ఐసీ) వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఆయన పుట్టిన తేదీ ఐఏఎస్‌ ఆఫీసర్స్‌ సివిల్‌ లిస్ట్‌లో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ఇక ట్రాయ్‌ వెబ్‌సైట్‌లో శర్మ ఇంటి అడ్రస్‌ దొరుకుతుంది. అంతేకానీ ఆధార్‌ డేటాబేస్‌ ద్వారా ఈ విషయాలన్నీ బహిర్గతం కాలేదని, ఆధార్‌ వివరాలు ఉడాయ్‌ సర్వర్‌లో చాలా భద్రంగా ఉంటాయి’ అంటూ ఉడాయ్‌కు ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.