ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గల్లా జయదేవ్
సూచన ఇచ్చిన సిఎం చంద్రబాబు
అమరావతి,జూలై19(జనం సాక్షి): లోక్‌సభలో టిడిపి అవిశ్వాస తీర్మానం నోటీసుపై స్పీకర్ సుమిత్రా మహాజన్ రేపు చర్చను చేపట్టనుండగా…ఎంపి జయదేవ్‌తో చర్చను ప్రారంభించాలని సిఎం చంద్రబాబు నిర్ణయించారు. తర్వత వచ్చే అవకాశాన్ని రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని కొనసాగించాలని పార్టీ ఎంపి లకు ఆయన సూచించారు. కాగా బాహుబలికి వచ్చిన కలెక్షన్ల కన్నా అమరాతికి కేంద్రం ఇచ్చిన నిధులు తక్కువగా ఉన్నాయని గతంలో లోక్‌సభలో గల్లా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.ఇప్పటికే అవిశ్వాస తీర్మానం గురించి టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశర చేశారు. ‘ఎన్డీయేతో ఎందుకు ఉన్నామో… ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చామో’ అందరికీ తెలిసేలా చేయాలని ఆయన సూచనలు చేశారు. అవిశ్వాస తీర్మాన మద్దతు కోసం టీడీపీ ఏ చిన్న ప్రయత్నాన్ని వదులుకోలేదు. ఓ వైపు ఎంపీలందరూ ఆయా పార్టీలను కలుస్తున్నారు. మోదీ సర్కారు నాలుగేళ్ల పాలన తర్వాత తొలి అవిశ్వాస పరీక్షను ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. నవ్యాంధ్రకు ప్రత్యేక ¬దా, ఇతర హావిూలను నెరవేర్చడంలో విఫలమైనందుకు మోదీ ప్రభుత్వంపై టీడీపీ గత బ్జడెట్ సమావేశాల్లోనే అవిశ్వాస
తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో మరోసారి నోటీసు ఇచ్చింది. స్పీకర్ సుమిత్రా మహాజన్ సోమవారం సభ ప్రారంభమైన రోజే అవిశ్వాస తీర్మానాన్ని అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చర్చ జరుగుతుందని చెప్పారు. దీంతో ఒక్కసారిగా వేడి రాజుకుంది. ఆ రోజు తప్పనిసరిగా సభకు హాజరు కావాలంటూ బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ, తృణమూల్ సహా దాదాపు అన్ని పార్టీలు విప్ జారీ చేశాయి. టీడీపీ అన్నీ వైపుల నుంచి మద్దతు కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఇకపోతే అవిశ్వాస తీర్మానంలో ఓటు వేయనని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తెగేసి చెప్పిన విషయం తెలిసిందే. రాయలసీమకు చెందిన మరో ఎంపీ అవిశ్వాసానికి హాజరుకాలేని పరిస్థితిలో ఉన్నారు. ఏపీ నుంచి ఇద్దరు ఎంపీలు అవిశ్వాసానికి దూరం కావడం టీడీపీకి నిజంగా చేదువార్త. విభజన హావిూలు కోసం కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇద్దరు ఎంపీలు గైర్హాజరుకావడం ఆ పార్టీని కలవరపెడుతోంది. నంద్యాల ఎంపీ ఎస్‌పీవైరెడ్డి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందువల్ల ఆయన కర్నూలు జిల్లాకే పరితమయ్యారు. కొంతకాలంగా ఆయనను అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. వైద్యుల సూచనల మేరకు ఆయన ఇంటివద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఎస్‌పీవైరెడ్డి గెలిచారు. అనంతరం రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరారు.