ఓవర్‌లోడ్‌ వాహనాలపై ఇక భారీగా జరిమానాలు

కరీంనగర్‌,నవంబర్‌22():పరిమితికి మించిన బరువును మోసుకెళ్తూ, కోట్లాది రూపాయల విలువైన రోడ్లను సర్వనాశనం చేస్తున్న వాహనాలపై చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈమేరకు డిసెంబర్‌ 1తర్వాత ఓవర్‌లోడ్‌ వాహనం రోడ్డుపైకెక్కితే యజమానిపై రవాణా చట్టం, ప్రజా ఆస్తుల విధ్వంసక నియంవూతణ చట్టం కింద క్రిమినల్‌ కేసుల నమోదు చేయనుంది. ఈ విషయమై ఇంతకాలం మిన్నకున్న రవాణాశాఖ ఎట్టకేలకు రహదారుల పరిరక్షణకు నడుం బిగించింది. పరిమితికి మించి బరువు తీసుకెళ్లే వాహనాలపై ర్యకు ఉపక్రమిస్తోంది. డిసెంబర్‌1ని గడువుగా ప్రకటించి, ఆ తర్వాత తీరుమారని యజమానులపై ఏకంగా క్రిమినల్‌ కేసుల నమోదుకు సిద్ధమవుతోంది.వేల కోట్ల ప్రజాధనంతో రహదారులను నిర్మిస్తుండగా, ఓవర్‌లోడ్‌ వాహనాల వల్ల మూణ్నాళ్లకే దెబ్బతింటు-న్నాయి. రెట్టింపు లోడ్‌తో వాహనాలు ప్రయాణిస్తుండడంతో కోట్లాది విలువైన రోడ్లు స్వల్ప వ్యవధిలోనే సర్వనాశనమవుతున్నాయి. గుంతలమయంగా మారి అనేక రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా జిల్లాలోనైతే పరిస్థితి దారుణంగా ఉంది. లెక్కకు మించిన క్వారీలతో పర్యావరణానికి అంతులేని నష్టాన్ని మిగుల్చుతున్న గ్రానైట్‌వ్యాపారులు, ఓవర్‌లోడ్‌ వాహనాలతో రోడ్లను కూడా సర్వనాశనం చేస్తున్నారు. క్వారీల నుంచి నిత్యం వందలాది లారీలు ఓవర్‌లోడ్‌ గ్రానైట్‌తో బయలుదేరి, జిల్లాలోని వివిధ రహదారుల విూదుగా సరిహద్దులు దాటుతున్నాయి. ఈ క్రమంలో గ్రావిూణ ప్రాంతాల్లోని చిన్నాచితకా రోడ్లు మొదలు కోట్లాది రూపాయలతో నిర్మించిన రాష్ట్ర రహదారులు కాలపరిమితికి ముందే దెబ్బతింటున్నాయి. ఓవర్‌లోడ్‌ వల్ల  ప్రభుత్వానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం కోల్పోవడంతో పాటు విలువైన రోడ్లు  ధ్వంసమవుతున్నాయి. జిల్లా నుంచి నిత్యం తరలి గ్రానైట్‌, ఇసుక లారీల యజమానుల ద్వారా పోలీస్‌, రవాణా శాఖ అధికారులకు నెలనెలా భారీగా ముడుపులు అందడం వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలున్నాయి. దీంతోపాటు ఇసుక, గ్రానైట్‌ మాఫియాలకు పేరొందిన రాజకీయ నేతల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కమిషనర్‌ ఆదేశాలు అమలవుతాయా అనేది ప్రశ్నర్థాకంగా మారింది.