ఓ వైపు బాబు సభ.. నిరసన కొనసాగిస్తామంటున్న ఎమ్మార్పీఎస్
కరీంనగర్,మార్చి2(జనంసాక్షి): వర్గీకరణపై ఎమ్మార్పీఎస్ పోరును ఉధృతం చేసింది. వరంగల్‌లో చంద్రబాబు పర్యటనకు అడ్డుతగిలిన ఎమ్మార్పీఎస్ ఇక్కడా అందుకు సిద్దం అవుతోంది. మరోవైపు అనుమతి లేకున్నా సభ నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. మాదిగ గర్జన సభకు పోలీసులు అనుమతి నిరాకరించినా తమ నిరసనను కొనసాగించి తీరుతామని అన్నారు. దీంతో బాబు పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. చంద్రబాబు జిల్లా పర్యటనకు అనుమతించిన ప్రభుత్వం శాంతియుతంగా నిరసనగా తెలుపేందుకు తాము సభ ఏర్పాటు చేసుకుంటామంటే ఎందుకు నిరాకరించడంపై మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తమ సభకు అనుమతి ఇవ్వని పక్షంలో వివిధ రూపాల్లో జరిగే నిరసన కార్యక్రమాలకు తెదేపా నాయకులు, పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోతే నిరసన ఉగ్రరూపం దాల్చుతుందన్నారు. చంద్రబాబును ఒప్పించి నెలలోపు తెలంగాణకు అదనపు విద్యుత్తును తీసుకువస్తామని చెబుతున్న తెలంగాణ తెదేపా నేతలు ఒక్క పైసా కూడా ఖర్చుకాని ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఎందుకు ఒప్పించలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రతీ విషయానికి రాద్దాంతం చేసే మోత్కుపల్లి ఎస్సీ వర్గీకరణ విషయమై చంద్రబాబును ప్రశ్నించకపోవడం దారుణమన్నారు. కేసీఆర్‌ది దొరల పార్టీ అంటున్న రేవంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావులు కలిస్తే తెదేపా కూడా దొరల పార్టే అవుతుంది కదా అని పేర్కొన్నారు. దీంతో మంగలవారం పరిస్థితులపై పోలీసులు పటిష్టంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చూస్తున్నారు.