ఔత్యాహిక మహిళా క్రీడాకారులకు స్ఫూర్తి
బ్యాట్ పట్టి మైదానంలో చెలరేగిన చిచ్చరపిడుగు
మిథాలీ క్రికెట్ చరిత్ర ఓ స్ఫూర్తిదాయక ఇన్నింగ్స్
న్యూఢల్లీి,జూన్10(జనంసాక్షి): భారత్‌లో మహిళా క్రికెట్‌కు ప్రాణం పోసి వేల మంది బాలికలను బ్యాట్‌తో క్రికెట్ మైదానానికి నడిపించిన మిథాలీరాజ్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఆమెను చూసి ఎందరో మైదానంలోకి వస్తున్నారు. తాము కూడా క్రికెటర్లు కావాలన్న ఆకాంక్షను వెలిబుచ్చుతున్నారు. అందుకు మిథాలిని ఆదర్శంగా తీసుకుంటు న్నారు. అయితే మిథాలీ రిటైర్మెంట్ ప్రకటనతో అంతర్జాతీయ మహిళా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిటన్లుఎ ప్రకటించగానే ఎందరో అభిమానులు ఓ రకంగా బాధపడ్డారు. తమ అభిమాన లేడీ క్రికెటర్ మెరుపులు చూడలేమన్న బాధను పలువురు ఔత్యాహక క్రికటర్లు ప్రకటించారంటే ఆమె ఎంతగా ప్రభావం చూపారో చెప్పలేం. రెండు దశాబ్దాల వెనక్కి వెళ్తే..అమ్మాయి బ్యాట్ పడితే ఇదేం విడ్డూరం అని చూసే రోజులవి. క్రికెట్ ఆడతానంటే కామెడీగా చూసే పరిస్థితులవి!అలాంటి స్థితిలో ఓ అమ్మాయి దశా దిశాలేని మహిళల క్రికెట్లోకి అడుగు
పెట్టింది. మ్యాచ్ ఆడితే ఫీజులివ్వకపోగా ఎదురు ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చినా తట్టుకుంది.. రైల్లో బెర్తు ఖరారు చేసుకోలేని పరిస్థితుల్లో జనరల్ బోగీల్లో ప్రయాణం చేసింది. చందాలేస్తే తప్ప పర్యటనలకు వెళ్లలేని స్థితిలోనూ నిబ్బరంగా నిలబడిరది. ఇవన్నీ చేసింది ఆట విూద ప్రేమతో. కానీ తిరిగి ఏవిూ ఇవ్వలేని నిస్సహాయ స్థితి ఆ ఆటది!కానీ తర్వాతి రోజుల్లో ఆమె తన ఘనతలతో ఆ ఆటలో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. లక్షల మంది అమ్మాయిలను క్రికెట్ బాట పట్టించింది. ఆటను శిఖర స్థాయికి చేర్చి, ఇప్పుడిక సెలవంటూ నిష్కమ్రించింది. ఎంచుకున్న ఆటలో అత్యున్నత స్థాయికి చేరుకునేవాళ్లు ఉంటారు. కానీ తనతో పాటు ఆటనొక స్థాయికి తీసుకురావడం ఆమెకే చెల్లు. దటీజ్ మిథాలీ రాజ్!
పురుషుల క్రికెట్‌లో సచిన్‌తో సరిసమానమైన ఖ్యాతినార్జించిన మిథాలీ తన అద్భుత ఆటతీరుతో లక్షలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. రెండు దశాబ్దాల పాటు భారత మహిళల క్రికెట్‌ను శాసించారు. ఎందరో మహిళలకు క్రికెట్ పట్ల అభిమానం ఏర్పడేలా చేశారు. 23 ఏళ్ల సుదీర్ఘ క్రికెట్ ప్రస్థానానికి ముగింపు పలికారు.. పదహారేళ్ల వయసులో బ్యాట్ పట్టి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన మిథాలీరాజ్.. 39 ఏళ్ల వయసులో తన ప్రస్థానానికి వీడ్కోలు పలికారు. 22 గజాల క్రికెట్ పిచ్‌పై..23 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ క్రికెట్ కెరీర్‌కు సెలవు ప్రకటించారు. అద్భుత ఆటతీరుతో వర్థమాన క్రికెటర్లకు దిశానిర్దేశం చేసి భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపు తీసుకొచ్చిన మిథాలీ… 23 ఏళ్ల పాటు భారత మహిళా క్రికెట్‌కు వెన్నెముకగా నిలిచారు. ఎన్నో రికార్డులను తన పేర లిఖించిన ఈ క్రికెట్ దిగ్గజం భారత్‌లో మహిళల క్రికెట్‌కు ఓ రూపునిచ్చారు.. భారత్‌లో మహిళా క్రికెట్‌ను తీర్చిదిద్దడంలో తన పాత్ర ఉన్నందుకు ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని మిథాలీ పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత జట్టుకు సారథ్యం వహించే అవకాశం వచ్చినందుకు ఆమెతో పాటు క్రికెట్ అభిమారులు గర్వపడ్డారు. మిథాలీ.. తన క్రికెట్ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఎంతోమంది ప్రతిభావంతులైన యువ క్రికెటర్లకు ఆశాదీపంగా నిలిచారు. భారత మహిళా క్రికెట్ భవిష్యత్తు దేదీప్యమానంగా వెలిగిపోవాలని మిథాలీరాజ్ ఎప్పుడూ కోరుకుంటుంటారు. మహిళా క్రికెట్‌లో ఎన్నో రికార్డులకు ఆమె కేంద్ర బిందువుగా నిలిచారు. 1999 జూన్ 26న అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాక.. 2022 మార్చి 27న మిథాలీ చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 23 ఏళ్లపాటు బ్యాటుతో కనికట్టు చేసి క్రికెట్ ప్రేమికులను మంత్రముగ్దులను చేశారు. సుదీర్ఘ కెరీర్‌లో 232 వన్డేలు ఆడి 7 వేల 805 పరుగులు చేసిన మిథాలీ.. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు లిఖించారు. మొత్తం 7,805 పరుగుల్లో ఏడు శతకాలు.. 64 అర్థ శతకాలు ఉన్నాయి. సుదీర్ఘ కెరీర్‌లో 12 టెస్టులు ఆడిన మిథాలీరాజ్.. ఒక ద్విశతకం సహా 4అర్థ శతకాలతో 699 పరుగులు చేశారు. మహిళల టెస్ట్ క్రికెట్‌లో.. ద్విశతకం చేసిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించారు. 19 ఏళ్ల వయసులో మిథాలి నెలకొల్పిన ఈ రికార్డు ఇప్పటికీ పదిలంగా ఉంది. 89 టీ20 మ్యాచ్‌లు ఆడిన మిథాలీ.. 17 అర్థ శతకాలతో 2 వేల 364 పరుగులు చేశారు. 3 ఫార్మట్లలో కలిపి 10 వేల 868 పరుగులు చేసిన మిథాలీ అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అని ఫార్మట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్‌గా చరిత్ర లిఖించారు. ఆరు ప్రపంచకప్‌లలో పాల్గొన్న మిథాలీ వరల్డ్ కప్‌లో వరుసగా ఏడు అర్థ శతకాలు సాధించి మరో రికార్డును కూడా నెలకొల్పారు. మిథాలీ సారథ్యంలోని జట్టు 2005, 2017లో ప్రపంచకప్ ఫైనల్‌కి చేరింది. సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో రికార్డులు నెలకొల్పిన మిథాలీకి ప్రపంచకప్ సాధించాలన్న కల మాత్రం నెరవేరలేదు. స్వస్థలం రాజస్థానే అయినా హైదరాబాదీగానే అందరికీ తెలిసిన మిథాలీ.. రెండు దశాబ్దాల పాటు గొప్పగా రాణించి భారత క్రికెట్లో దిగ్గజ హోదాను
అందుకుంది. 1999లో ఆమె అరంగేట్రం చేసినప్పుడు మహిళల క్రికెట్ గురించి పట్టించుకున్న వాళ్లే లేరు. కానీ లక్షలాది అమ్మాయిలు క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంటున్నారంటే అది మిథాలి ఇచ్చిన స్ఫూర్తే. అందులో ఎలాంటి సందేహమూ లేదు. మైదానంలో అడుగుపెట్టిన ప్రతిసారీ జట్టును గెలిపించడం కోసం అత్యుత్తమ ప్రదర్శనతో పోరాడిరది. దేశం తరఫున ఆడేందుకు లభించిన అవకాశం నాకు ఎప్పటికీ ఓ మధుర స్మృతిగా ఉండిపోతుందని మిథాలీ పేర్కొనడం చూస్తే ఆమె ఎంతగా క్రికెట్‌ను ప్రేమించిందో అర్థం చేసుకోవచ్చు. అందుకే ఇప్పుడు సమర్థులైన, ప్రతిభావంతులైన యువ క్రికెటర్లు ఇంకా రావాలని కోరనుకుంటోంది. భారత క్రికెట్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉందని మిథాలీ అంటోంది. మహిళా క్రికెట్లో సచిన్
అని మిథాలీని పిలుస్తారు. దాదాపు 23 ఏళ్ల కెరీర్‌లో ఆమె ఎన్నో ఘనతలు సాధించింది. సచిన్‌లాగే జట్టు కోసం ఎంతో చేసింది. ఇంకా చెప్పాలంటే.. సచిన్‌కు సాధ్యం కాని రికార్డులూ అందుకుంది. అందులో ముఖ్యంగా కెప్టెన్సీ గురించి చెప్పుకోవాలి. మిథాలీ సారథిగా జట్టును అద్భుతంగా నడిపించింది. అసాధ్యం అనుకున్న విజయాలను అందించింది. కెప్టెన్‌గానే ఆటకు వీడ్కోలు పలికింది.