కంచరగుంటలో ఎంపిడివో కసరత్తు
పారిశుద్ధ్య పనుల పరిశీలన
ప్రజలకు, అధికారులకు సూచనలు, హెచ్చరికలు
ముళ్లపొదల్లో నడిచి మంచినీటి పథకం పరిశీలన
సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల వినతి
కందుకూరు , జూలై 28 : మండల పరిధిలోని కంచరగుంట గ్రామాన్ని ఎంపిడిఓ విజయలక్ష్మి శనివారం పరిశీలించారు. ఈ పరిశీలన సందర్భంగా ఎంపిడివో గ్రామ సమస్యల అవగాహన పెద్ద కసరత్తునే చేశారు. గ్రామానికి మంచినీరు అవసరాలకు వినియోగిస్తున్న మంచినీటి బావి మరియు పథకాన్ని పరిశీలించుటకు కిలోమీటర్ ముళ్ల పొదల్లో నడిచి ఎంపిడివో వెళ్లడం ఆశ్చర్యకరం. బావిని పరిశీలించిన ఆమె క్లోరినేషన్ చేయాలని, బావికి రక్షణగా ట్రాలీ ఏర్పాటు చేయాలని ఇవోఆర్‌డి రత్నజ్యోతిని ఆదేశించారు. అదే విధంగా గ్రామంలోని అన్ని వీధులను పరిశీలించి గ్రామస్తులకు, సిబ్బందికి పలు సూచనలు, హెచ్చరికలు చేశారు. అదే విధంగా ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం అమలు తీరుపై వాకబు చేశారు. ఎన్‌ఆర్‌ఇజిఎస్ పథకం ద్వారా మామిడిమొక్కలు నాటిన మహిళలను మొక్కలు పెంపకంపై వివరాలు సేకరించారు. గ్రామంలో మురుగునీటి కాలువలు ఏర్పాటు చేయాలని, మంచినీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు ఎంపిడివోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా సమస్యలు పరిష్కరిస్తానని ప్రజలకు ఆమె హామీ ఇచ్చారు. ఈ పరిశీలనలో పంచాయితీ కార్యదర్శి కృష్ణమోహన్, శ్యాంసుందర్, ఎఎన్‌ఎం శ్రీదేవి, గ్రామస్తులు పాల్గోన్నారు.