కంటి వెలుగు పేదలకు వరం

ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి: కొప్పుల

జగిత్యాల,ఆగస్ట్‌8(జ‌నం సాక్షి): సీఎంకెసిఆర్‌ కంటి వెలుగు పేరుతో మరో అద్బుతమైన కార్యక్రమాన్ని రూపొందించారని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ పథకాన్ని సీఎం కేసీఆర్‌ మన రాష్ట్రంలో ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో జిల్లాను మొదటి స్థానంలో నిలిపిన విధంగా ఈ కార్యక్రమాన్ని అధికారులు, సిబ్బంది క్షేత్ర స్థాయిలో విజయవంతం చేయాలన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్‌ తెలంగాణకు కంటి వెలుగు కార్యక్రమాన్ని రూపొందించారని పేర్కొన్నారు. ప్రజల కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు. అందులో భాగంగా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల కంటి సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని అన్నారు. ప్రతి ఒక్కరికీ జాగ్రత్తగా కంటి పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. జిల్లాలోని చిన్న పిల్లల నుంచి వృద్ధులవరకు 9.85లక్షల మందికి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. పరీక్షల అనంతరం అవసరమైన మందులు, కంటి అద్దాలు అందజేస్తామన్నారు. అవసరమైన వారికి ప్రభుత్వం నిర్ణయించిన దవాఖానాల్లో ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామన్నారు. ఆరు నెలలపాటు జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని విజయవంతం చేసినట్లుగానే దీనిని విజయవంతం చేయాలన్నారు. కంటి వెలుగు పరీక్షలు నిర్వహించే తేదీ, సమయాన్ని గ్రామాల్లో ముందస్తుగా ప్రజలకు అంద జేయాలన్నారు. ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు నిర్వహిస్తామన్నారు.