కడపలో కేంద్రమంత్రికి చేదు అనుభవం
హెగ్డే కాన్వాయ్‌ను అడ్డుకున్న ఉక్కు ఆందోళనకారులు
కడప,సెప్టెంబర్1(జనం సాక్షి ): కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ (ఆర్సీపీ) నాయకులు కేంద్రమంత్రి అనంత్‌కుమార్ హెగ్డే కాన్వాయిను అడ్డుకున్నారు. పోలీసులు ఆందోళనకారులను బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. పోలీసులకు ఆందోళనకారుల మధ్య కొద్ది సేపు తోపులాట చోటు చేసుకుంది. ఓ మహిళా కార్యకర్త మంత్రి వాహనంపై బూటు విసిరేసింది.డపలో తపాల శాఖకు సంబంధించిన కార్యక్రమానికి మంత్రి అనంతకుమార్ హేగ్డే విచ్చేశారు. ఆయన ఆర్‌అండ్‌బీ అతిథి గృహం నుంచి కార్యక్రమానికి కాన్వాయిలో బయలుదేరారు. ఇంతలో అక్కడే ఉన్న ఆర్సీపీ నాయకులు ఆయన వాహనానికి అడ్డుపడ్డారు. వాహనాన్ని ముందుకు వెళ్లనివ్వకుండా ఆపేశారు. ఇంతలో పోలీసులు వచ్చి వారందరిని బలవంతంగా అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇద్దరు మహిళా కార్యకర్తలు ఆయన కారును ముందుకు వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. సమయానికి అక్కడ మహిళా పోలీసులు లేకపోవడంతో వారిని పురుష పోలీసులే బలవంతంగా లాగేశారు. దీంతో ఓ మహిళా కార్యకర్త ఆగ్రహంతో అక్కడే ఉన్న బూటును తీసుకెళ్లి పరిగెత్తుకుంటూ వెళ్లి మంత్రి కారుపై విసిరేసింది. దీంతో కొద్ది సేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. 365 రోజుల పాటు ఉక్కు కోసం ఆందోళనలు చేస్తుంటే ఏ ఒక్కరు పట్టించుకోలేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఢిల్లీలోనే కాదు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ జెండాను ఎగురవేస్తామని కేంద్రమంత్రి అనంతకుమార్ హెగ్డే పేర్కొన్నారు. శనివారం ఆయన కడపలో విలేకరులతో మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే యుద్దభూమిని వదలం.. అంటూ ఆయన అన్నారు.