కడప ఉక్కు సీమహక్కు
విస్మరించిన వారికి గట్టిగా బుద్ది చెబుతాం
కడప,సెప్టెంబర్17(జనంసాక్షి): కడప ఉక్కుపరిశ్రమ రాయలసీమ హక్కు అని రాయలసీమ అభివృద్ధి వేదిక
నాయకులు అన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే రాయలసీమ అభివృద్ధికి ఎంతగానో
దోహదపడుతుందని కరవు, కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుందని అన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి రూ.50 వేల కోట్లు కేటాయించి అభివృద్ధి చేయాలని, సీమలోని నాలుగు జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హావిూలను అమలుచేయాలని, కడపలో ఉక్కు పరిశ్రమను స్థాపించాలని డిమాండు చేసారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో వెనుకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషిచేయాలని వారు కోరారు. ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలు లేక యువత, సరైన మౌలిక వసతుల కల్పన లేక సీమవాసులు నిత్యం కరవు కోరల్లో చిక్కుకుంటున్నారు. సీమలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, రూ.50 వేల కోట్ల ప్యాకేజీ, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తదితర డిమాండ్ల సాధనకు చేస్తున్న పోరాటాలతో ప్రజల్లో మంచి స్పందన వచ్చిందన్నారు. దీనిపై ప్రభుత్వం తక్షణం స్పందించాలన్నారు. కడపలో ఉక్కు పరిశ్రమ, సీమకు రూ.50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి అంశాలను సాధించేంత వరకు యువత పిడికిలి సడలించవద్దని యువతకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేంత వరకు ఉద్యమాలను నిరంతరం కొనసాగిస్తామని తెలియ జేశారు. సీమాభివృద్ధికి రాజకీయ పార్టీలు కలిసి రావాలని పిలుపునిచ్చారు.ప్రజా ఉద్యమాల ద్వారా అభివృద్ధి సాధ్యమని, ఉక్కు పరిశ్రమ స్థాపించే వరకు ఉద్యమాలను ఉద్ధృతం చేయాలని సూచించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు మొండివైఖరి అవలంబి స్తోందని విమర్శించారు. కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అయ్యేంత వరకు పాలకవర్గాలను నిద్రపోనివ్వమని హెచ్చరించారు.