.కడుపులో కత్తులు.. పైకి కౌగిలింతలు
` మీపాపాలు ఊరికే పోవు
` మీది పైసల పంచాయతీ
` మీ వెనకాల నేనెందుకుంటా?
` కత్తులతో ఒకరినొకరు పొడుచుకుంటున్నారు
` లక్షకోట్లను పంచుకోవడంలో కేసీఆర్ కుటుంబంలో కలహాలు
` మీ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దు
` బీఆర్‌ఎస్ సచ్చిన పాము..దానిని మళ్లీమళ్లీ చంపడమెందుకు?
` వారి పంచాయితీలో తలదూర్చే సమయంమాకెక్కడిది
` కవిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్
హైదరాబాద్(జనంసాక్షి): భారత రాష్ట్ర సమితి నేతలను ప్రజలు తిరస్కరించారని, అలాంటి వారి వెనుక తాను ఎందుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ కవిత.. హరీశ్‌రావు వెనుకాల రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆరోపించారు. ఆమె వ్యాఖ్యలపై సీఎం తాజాగా స్పందించారు.‘’నేను కవిత వెనుకున్నాను అని కొందరు అంటున్నారు. హరీశ్‌రావు, సంతోష్ వెనుక ఉన్నానని మరికొందరు అంటున్నారు. నేను ఎవరి వెనుకా లేను. ఇప్పటికే ప్రజలు వాళ్లను తిరస్కరించారు. అలాంటి వారితో కలిసే సమయం నాకు లేదు. ప్రజల వెంట మాత్రమే ఉంటాను. మీ కుల, కుటుంబ పంచాయితీల మధ్య మమ్మల్ని తీసుకురావొద్దు’’అని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. లక్ష కోట్లు- దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. పంపకాల్లో తేడాలు వచ్చి ఒకరినొకరు కొట్టుకుంటున్నారు. అక్క, అన్న, చెల్లి, బావ ఒకరినొకరు కత్తులతో పొడుచుకుంటున్నారు. దోపిడీ సొమ్ము వాళ్లింట్లో చిచ్చు పెట్టింది. సంపాదించుకున్న టీవీలు, పేపర్ల కోసం కొట్టుకుంటున్నారు. వాళ్లు వాళ్లు కొట్టు-కుంటూ మాపై నిందలు వేస్తున్నారు. విూ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు. చచ్చిన పామును మళ్లీ చంపాల్సిన అవసరం మాకేముంది. బీఆర్‌ఎస్ ను ప్రజలే బొందపెట్టారని సీఎం రేవంత్ మండిపడ్డారు. దోపిడీ సొమ్మే ఇవాళ వాళ్ల మధ్య చిచ్చు పెట్టిందని, వాటాల కోసం వాళ్లు వాళ్లు కొట్టుకుంటూ మాపై నిందలు వేస్తున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలే బొంద పెట్టారని.. సచ్చిన పామును చంపాల్సిన అవసరం మాకేముందని ఎద్దేవా చేశారు. విూ కుటుంబ పంచాయితీలోకి మమ్మల్ని లాగొద్దని హెచ్చరించారు. ‘‘ కాంగ్రెస్ పార్టీని బతకనివ్వమని ఆనాడు శాసనసభ్యులు కాకుండా అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టారు.ఇవాళ వాళ్ళేతన్నుకుని చస్తున్నారు.. ఒకరినొకరు కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు.ఎవరూ అక్కర్లేదు వాళ్లను వాళ్ళే పొడుచుకుంటారు.అవినీతి సొమ్ము పంపకాల్లో తేడా వచ్చి కుటుంబంలో తగాదాలు పెట్టుకుంటున్నారు.కడుపులో కత్తులు పెట్టుకుని కౌగిలించుకుంటున్నారు.పాపం ఊరికే పోదు.. ఆ పాపాలు వెంటాడుతూనే ఉంటాయి.. ఖచ్చితంగా అనుభవించాల్సిందే.ఒకరివెనక ఒకరు ఉన్నారని కొందరు మాట్లాడుతున్నారు.అంత చెత్తగాళ్ళ వెనక నేనెందుకు ఉంటాను.నేను నాయకుడిని.. ఉంటే ముందుంటా నా వాళ్లకు తోడుగా ఉంటా…వాళ్ళ కుటుంబంలో వాళ్లు వాళ్లు కత్తులతో పొడుచుకుని హరీష్, సంతోష్ వెనక రేవంత్ రెడ్డి ఉన్నారని ఒకరంటే లేదు లేదు కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారని ఇంకొకరంటున్నారు.మీరంతా దిక్కుమాలినవారని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టారు.. అన్నం తినేవారు ఎవరైనా మీ వెనక ఉంటారా? దయచేసి మీ కుటుంబ పంచాయతీలనో మీ కుల పంచాయతీలోనో.. మమ్మల్ని లాగకండి..మాకు ఎలాంటి ఆసక్తి లేదు.మిమ్మల్ని ఎప్పుడో ప్రజలు తిరస్కరించారు.కాలం చెల్లిన నోటు లాంటిది ఆ పార్టీ.. కాలగర్భంలో కలిసిపోతుంది.ప్రకృతి ఉంటుంది.. ప్రకృతి శిక్షిస్తుంది’’ అని అన్నారు.
హన్‌మాన్ గుడి లేకపోవచ్చు
ఇందిరమ్మ ఇళ్లు లేని ఊరు ఉండదు
` కాంగ్రెస్ అంటేనే పేదలపక్షం
` ఇందిరమ్మ ఇళ్ల బాధ్యతను నెరవేరుస్తున్న పొంగులేటి
` పదేళ్లుగా లేని రేషన్ కార్డులు ఇచ్చాం
` పేదలందరికి సన్నబియ్యం సరఫరా
` ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభంలో సిఎం రేవంత్ రెడ్డి
భద్రాద్రిక్తొగూడెం,చంద్రుగొండ(జనంసాక్షి): హనుమాన్ గుడి లేని ఊరు ఉండొచ్చు గానీ.. ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు ఉండదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలందరికీ ఇళ్లు వచ్చేలా చేయాలన్నా.. ధరణి భూతం నుంచి రైతులకు విముక్తి కల్పించాలన్నా సమర్థుడైన మంత్రి కావాలని భావించా. అందుకే, పార్టీ అధిష్ఠానాన్ని ఒప్పించి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి గృహనిర్మాణ, రెవెన్యూ శాఖలు అప్పగించా. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమాన్ని మంత్రి పొంగులేటి విజయవంతం చేశారని అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం దామరచర్లలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.ఇల్లులేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామని గతంలో వైఎస్‌ఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో 2004 నుంచి 2014 మధ్య 22 లక్షల ఇందిరమ్మ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం కట్టించి ఇచ్చింది. ఇందిరమ్మ ఇళ్లలోకి పేదలు ప్రవేశించినప్పుడు వచ్చే ఆనందం వెలకట్టలేనిది. పేదల కష్టాలు మాకు తెలుసు కాబట్టే .. పేదరికాన్ని రూపుమాపాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర ప్రజలకు పదేళ్లపాటు-.. కొత్త రేషన్ కార్డులు అంటే ఏంటో తెలియదు. మా ప్రభుత్వం రాగానే లక్షలాది రేషన్ కార్డులు, ఇళ్లు ఇచ్చాం. మేము ఏ బియ్యం తింటున్నామో.. పేదలకూ అవే సన్నబియ్యం ఇస్తున్నాంఅని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ విషనాగు. ఈ పాములో కాలకూట విషం ఉంది. అయితే, ప్రజలు దాని కోరలు ఎప్పుడో పీకేశారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. దామరచర్ల బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, సొంతిల్లు అనేది ప్రతి పేదవాడి జీవితస్వప్నం అని.. గత పదేళ్లు పేదలకు ప్రభుత్వ ఇళ్లు దక్కలేదని అన్నారు. ఏటా 2 లక్షల ఇళ్లు కట్టినా పదేళ్లలో 20 లక్షల మందికి వచ్చేవని.. కానీ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు అంటూ గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని విమర్శించారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కళ్లలో ఆనందం కనబడుతోంది. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హావిూ ఇచ్చారు. బీఆర్‌ఎస్ తెచ్చిన ధరణికి పాతరేసి భూభారతి తీసుకొచ్చి రైతుల సమస్యలు పరిష్కరించామని వెల్లడిరచారు. మునుపెన్నడూ లేని విధంగా రేషన్ షాపుల్లో సన్నబియ్యం సరఫరా చేస్తున్నామని అన్నారు. మన పిల్లలు బర్రెలు, గొర్రెలు కాచుకోవాలని కేసీఆర్ పార్టీ వాళ్లు అంటారని.. వాళ్ల పిల్లలు మాత్రం చదువుకుని రాజ్యం ఏలి దోచుకుంటారట అంటూ తీవ్రంగా విమర్శించారు. టీవీలు, పేపర్లు సంపాదించుకున్నారు.. వాటి కోసం కొట్టు-కుంటు-న్నారని ఆరోపించారు. బెండాలపాడులో ఇందిరమ్మ ఇళ్ల పైలాన్‌ను ఆవిష్కరించారు సీఎం రేవంత్. అనంతరం ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి లబ్దిదారులతో కలిసి గృహ ప్రవేశం చేశారు. తెలంగాణ తొలి దశ ఉద్యమం ఖమ్మం జిల్లా పాల్వంచలోనే మొదలైందని, ఖమ్మం జిల్లా ప్రజల తెలంగాణకు దిశ దిశను చూపించారన్నారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలబడాలని కమ్యూనిస్టులు కాంగ్రెస్‌తో కలిశారు. ఇది ఎన్నికల స్టంట్ కాదు. ప్రజలు ఆలోచన చేయాలి. రోటి, కప్డా, మకాన్ అనే నినాదాన్ని నాడు ఇందిరమ్మ కొనసాగిస్తే, అదే నినాదాన్ని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గల్లీ గల్లీ.. ఊరు ఊరు తిరిగి ప్రతి పేద వాడికి 25 లక్షల ఇండ్లు కట్టించి ఇచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు ఉన్న ఊర్లోనే ఓట్లు- అడుగుతామని 2023 ఎన్నికల్లో కేసీఆర్‌కు సవాలు విసిరా. పేదలు ఇందిరమ్మ ఇళ్లలోకి గృహ ప్రవేశం చేసినప్పుడు కలిగిన ఆనందం నేను జూబ్లీహిల్స్‌లో గృహప్రవేశం చేసిన రోజు కూడా రాలేదన్నారు. 4500 ఇండ్లు కేవలం అశ్వరావు పేటకు ఇచ్చా. కొందరికి పేదరికం అంటే ఎక్స్ కర్షన్.. మేము పేద వర్గంలో పుట్టి పెరిగి, వారితో అన్ని సమానంగా పంచుకున్నాం. పేదలుగా బతకడం మా జీవన విధానం. పేదరికం తెలిసి, కుటుంబ సభ్యులుగా భావించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇందిరమ్మను పేద ప్రజల గుండెల్లో అమ్మలా గుడి కట్టుకున్నారు. పేదలు కళ్లు కాయలు కాసేలా వేచి చూసిన గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమం అందలేదు.ఉమ్మడి ఖమ్మం జిల్లా సమయస్ఫూర్తి కలిగిన జిల్లా. అందుకే ఈ జిల్లా నుంచి ముగ్గురు మంత్రులను చేశాం. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి. పదేళ్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండి ఉంటే పేద వర్గాల కష్టాలు తీరిపోయేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కర్యక్రమంలో మంత్రి పొంగులేటి, ఎంపిలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
మొదటి ముద్ద పాలమూరుకే..
` పరిశ్రమలస్థాపనలో తొలి ప్రాధాన్యం ఈ జిల్లాకే..
` సాగునీటి ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు
` ఎస్‌జిడి కార్నింగ్ టెక్నాలజీస్ ఫర్నేస్ లైటింగ్ ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్
మహబూబ్‌నగర్ బ్యూరో (జనంసాక్షి): తనకు ఏ అవకాశం వచ్చినా.. మొదటి ముద్ద పాలమూరుకు పెడతా అని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు రాష్ట్రంలో ఏ పార్టీ ఉండకూడదని చూసిన వారు.. ఇపుడు వాళ్లకు వాళ్లే కడుపులో కత్తులు పెట్టుకుని.. కౌగిలించుకుంటున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల ఉన్నానని ఒకరు, కవిత వెంట ఉన్నానని మరొకరు అంటున్నారని.. ఎవరి వెనకాల తాను ఎందుకు ఉంటా.. అని ప్రశ్నించారు. తాను ప్రజల అభివృద్ధి కోసం ముందు ఉంటానని వివరించారు. ఒకప్పుడు జనతా పార్టీ చాలా ఫేమస్.. కాల గర్భంలో కలిసిపోయిందని గుర్తు చేశారు. ఏ పార్టీ, ఎవరు శాశ్వతం కాదని హితవు పలికారు. పాపం ఎప్పుడూ ఊరికే పోదని నొక్కిచెప్పారు.ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్య, వైద్య రంగాలతో పాటు సాగు నీటి ప్రాజెక్టుల పూర్తికి ప్రాధాన్యత ఇస్తూ వలసల పాలమూరు జిల్లాను అభివృద్ధి కి కలిసి కట్టుగా కృషి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం వేముల గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన ఎస్.జి.డి కార్నింగ్ ఫార్మాస్యూటికల్ గ్లాస్ ట్యూబింగ్ జాయింట్ వెంచర్ ఫర్నేస్ లైటింగ్ ప్రారంభ వేడుకలో మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణా రావు, శాసనసభ్యులు జి.మధుసూదన్ రెడ్డి తో కలిసి పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ జిల్లా నూతన పరిశ్రమలకు వేదిక కాబోతోంది అన్న రేవంత్ రెడ్డి… నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలకు మహబూబ్ నగర్ జిల్లా వేదిక కాబోతుందన్నారు. ఒకప్పుడు పాలమూరు జిల్లా వలసలకు మారుపేరనీ, నాటి పాలకులు పేదరికం, వలసలు, సమస్యలను చూపించడానికి ప్రపంచ నాయకులను పాలమూరు జిల్లాకు తీసుకువచ్చే వారన్నారు. భవిష్యత్తులో మన అభివృద్ధిని,పరిశ్రమలను, యూనివర్సిటీలను, సాగునీటి ప్రాజెక్టులను చూపించేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వచ్చేలా జిల్లాను అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ ప్రాంత ప్రజలకు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ అందుబాటులో లేకపోవడం వల్లే ఆ పరిస్థితి ఏర్పడిరదని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన పాలమూరు రంగారెడ్డి, జూరాల, నెట్టెంపాడు వంటి ఏ ప్రాజెక్టులు సంపూర్ణంగా పూర్తి కాలేదని… ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఎంప్లాయిమెంట్ లో మన జిల్లాను అభివృద్ధి చేసుకోకపోతే శాశ్వతంగా జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుంది అన్నారు. విద్య ఒక్కటే మన తలరాతలు మారుస్తుందనీ వలసలు వెళ్ళే పాలమూరు బిడ్డలు ఆ వలసల బారి నుండి బయటపడాలంటే చదువొక్కటే మార్గమన్నారు. పాలమూరు జిల్లా నుంచి ఇంజనీర్లు, డాక్టర్లే కాదు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లు అయ్యి రాష్ట్రానికే కాదు దేశానికి సేవలందించేలా ఎదగాలనీ అందుకే.. జిల్లాకు ఇంజనీరింగ్, లా కాలేజీ, డిగ్రీ కాలేజీలతో పాటు ట్రిపుల్ ఐటీని పాలమూరు జిల్లాకు మంజూరు చేయడం జరిగిందని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఒక్కో నియోజకవర్గానికి రూ. 200 కోట్ల చొప్పున రూ. 2800 కోట్లతో ఉమ్మడి జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామన్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14 నియోజకవర్గాల్లో 14 అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేసి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేసుకునే విధంగా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగుతుందన్నారు. చదవాలంటే మనకు వసతులు ఉండాలి, ఆ వసతులు అందించే బాధ్యత పాలమూరు బిడ్డగా నేను తీసుకుంటానని హామీ ఇచ్చారు. చదువు అందించేందుకు ఎక్కడ ఏది కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానన్నారు.
పాలమూరు ప్రాజెక్టులకు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి ప్రాజెక్టులు పూర్తి చేస్తా..
ఉదండాపూర్ జలాశయం పూర్తి చేయాలని ప్రయంత్నిస్తుంటే ప్రతిపక్షాలు గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసులు వేసి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారనీ దుయ్యబట్టారు. ఏ ప్రాజెక్టులు కట్టాలన్నా, పరిశ్రమలు నెలకొల్పాలని భూమి అవసరమని… రైతులకు ఎప్పటికీ అన్యాయం చేయమని, భూసేకరణ విషయంలో రైతులతో మాట్లాడి ఒప్పించి మంచి పరిహారం అందించాలని జిల్లా కలెక్టర్ లు, అధికారులకు సూచిస్తున్నట్లు తెలిపారు. గతంలో నాయకత్వ నిర్లక్ష్యం వల్లే ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రాజక్టులు పూర్తి కాలేదనీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు. అన్ని అడ్డంకులను అధిగమించి అసంపూర్తిగా ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసుకుందామని అన్నారు. గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు అందించి పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ ఈ రెండే పాలమూరు జిల్లా రూపురేఖలు మారుస్తాయనీ పునరుద్ఘాటించారు. ఇది బాధ్యత, నైతిక ధర్మం అన్న ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి.. . రాజకీయ కారణాలతో అభివృద్ధిని అడ్డుకుంటే మనకు మనమే మరణ శాసనం రాసుకునేవాళ్లం అవుతామన్నారు.
భూమికి బదులు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం..
కొడంగల్, నారాయణపేటకు ఎత్తిపోతల పథకం తెస్తే.. ఎన్ జి టి లో ఫిర్యాదు చేస్తున్నారుని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అక్కడ భూసేకరణ కోసం వెళ్తే.. రైతులు కొడంగల్ లో ఇచ్చినట్లు రూ. 20 లక్షలు డిమాండ్ చేస్తున్నారని వివరించారు. కొడంగల్ పరిస్థితి వేరు.. నారాయణపేట పరిస్థితి వేరు అని స్పష్టం చేశారు. నారాయణ పేట వారికి కావాలంటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని అన్నారు. ఇక్కడ భూసేకరణ కోసం మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే పర్ణికారెడ్డి, కలెక్టర్‌లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆబ్కారీ, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, పశు సంవర్ధక, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి, మహబూబ్ నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, జడ్చర్ల శాసనసభ్యులు అనిరుధ్ రెడ్డి, వనపర్తి శాసనసభ్యుడు తూడి మేఘా రెడ్డి, నారాయణపేట శాసన సభ్యులు పర్ణిక రెడ్డి, షాద్ నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్,జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి ఎస్.జి.డి టెక్నాలజీస్ మేనేజింగ్ డైరెక్టర్ దీపక్ సర్జిత్, సుధీర్, తదితరులు పాల్గొన్నారు.