కనువిందు చేసిన ఎర్రచంద్రుడు
ఆకాశంలో అరుదైన, అందమైన దృశ్యం కనిపించింది. చంద్రుడు రోజూ కనిపించే దానికన్నా పెద్ద సైజులో ఎరుపు వర్ణంలో దర్శనమిచ్చాడు. దీన్నే సూపర్ బ్లడ్ మూన్ అంటారు. ఈ అద్భుత దృశ్యాన్ని చూసే అవకాశం చాలా అరుదుగా మాత్రమే దక్కుతుంది. చంద్రుడు భూమికి సమీపంగా వచ్చిన రోజే చంద్ర గ్రహణం ఏర్పడటమే ఈ సూపర్ బ్లడ్ మూన్ ఆవిష్కారం కావడానికి కారణం.
భూమి చుట్టూ ఒక నిర్దిష్ట కక్ష్యలో పరిభ్రమించే చంద్రుడు… అప్పుడప్పుడు భూమికి సమీప బిందువు దగ్గరకు వస్తాడు. అలా వచ్చినప్పుడు చాలా పెద్దగా కనిపిస్తాడు. ఐతే, అదే రోజు చంద్రగ్రహణం ఏర్పడితే ఆ పెద్దగా కనిపించే చంద్రుడు ఎరుపు రంగులో దర్శనమిస్తాడు. ఇలా చంద్రుడు పెద్దగా, ఎర్రగా కనిపించడాన్నే సూపర్ బ్లడ్ మూన్ గా పిలుస్తారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (ఇవాళ) తెల్లవారుజామున 5 గంటల 41 నిమిషాలకు ఆ అద్భుత దృశ్యం ఆవిష్కారమైంది. 10 గంటల 53 నిమిషాలకు ముగిసింది.
సూపర్ బ్లడ్ మూన్ ను దర్శించే అవకాశం భారత ప్రజలకు దక్కలేదు. చంద్ర గ్రహణం ఏర్పడే సమయానికి భారత్ లో తెల్లవారడం వల్ల ఎర్రని చంద్రుడు కనిపించలేదు. ఐతే, యూరప్, ఆఫ్రికా, అమెరికా దేశాల్లో మాత్రం సూపర్ బ్లడ్ మూన్ దర్శనమిచ్చింది. పశ్చిమాసియా దేశాల్లో పాక్షికంగా కనిపించింది. ఆకాశంలో కనిపించిన అరుదైన, అందమైన దృశ్యాన్ని చూసి పశ్చిమ దేశాల ప్రజలు ఎంజాయ్ చేశారు.
సూపర్ బ్లడ్ మూన్ అత్యంత అరుదుగా మాత్రమే కనిపించే దృశ్యం. చివరగా 1982 లో సూపర్ బ్లడ్ మూన్ దర్శనమిచ్చింది. దాదాపు 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఆ దృశ్యం ఆవిష్కారమైంది. భవిష్యత్తులో సూపర్ బ్లడ్ మూన్ ను చూడటానికి మరో 18 ఏళ్లు పడుతుందని ఖగోళ శాస్త్రజ్ఞులు తెలిపారు. 2033లో మరోసారి సూపర్ బ్లడ్ మూన్ ను చూసే అవకాశం దక్కుతుందని చెప్పారు.