కన్నీటి వీడ్కోలు 

– కలైంజర్‌ను కడసారి చూసేందుకు పోటెత్తిన ప్రజలు
– జనసంద్రంగా మారిన రాజాజీహాల్‌ ప్రాంతం
– తోపులాటతో ఇద్దరు మృతి, 26మందికి గాయాలు
– కలైంజర్‌ పార్థివ దేహానికి రాజకీయ, సినీ ప్రముఖుల నివాళులు
– మోడీ, రాహుల్‌, చంద్రబాబు, కేసీఆర్‌తో సహా నివాళులర్పించిన పలువురు నేతలు
– అశ్రునయనాల మధ్య సాగిన అంతిమయాత్ర
– దారిపొడవునా కన్నీటి వీడ్కోలు పలికిన తమిళ ప్రజలు
– ప్రభుత్వ లాంఛనాల నడుమ మెరీనాబీచ్‌లో కరుణానిధి అంత్యక్రియలు
చెన్నై, ఆగస్టు8(జ‌నం సాక్షి) : తమిళుల ఆరాధ్యదైవం.. తమిళ ప్రజల పక్షాన నిలిచిన పోరాట యోధుడు, రాష్ట్రంతోపాటు జాతీయ రాజకీయాలపై తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి తమిళ ప్రజలు, రాజకీయ, సినీ ప్రముఖులు కన్నీటి వీడ్కోలు పలికారు. తమ అభిమాన నేతను కడసారి చూసేందుకు కలైంజర్‌ పార్ధివదేహం ఉంచిన రాజాజీహాల్‌ వద్దకు అభిమానులు పోటెత్తారు.. ఉదయం నుంచి సాయంత్రం 4గంటల వరకు రాజాజీహాల్‌ వద్దకు భారీ సంఖ్యలో అభిమానులు, డీఎంకే కార్యకర్తలు తరలిరావడంతో ఆ ప్రాంతం జనసంద్రంతో కిక్కిరిసిపోయింది. భారీగా తరలివచ్చిన అభిమానులు అదుపు చేసేందుకు పోలీసులకు కష్టసాధ్యం మారింది. ఒకానొక దశలో భారీగా తరలివచ్చిన అభిమానులు అభిమాన నేతను కడసారిచూసేందుకు పోటీపడటంతో తోపులాట చోటు చేసుకుంది. ఈ సమయంలో పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. ఈ తోపులాటలో ఇద్దరు మృతిచెందగా, మరో 26మంది గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.. కాగా సాయంత్రం 4గంటల సమయంలో కరుణానిధి అంతిమయాత్ర ప్రారంభం కావటంతో యాత్ర పొడవునా తమిళ ప్రజలు, అభిమానులు కరునానిధికి కన్నీటి వీడ్కోలు పలికారు.. జననేత ఇక లేరంటూ కన్నీరు మున్నీరయ్యారు..  వాలాజా రోడ్డు, చెపాక్‌ స్టేడియం నుంచి మెరీనా బీచ్‌వరకు సాగిన అంతిమయాత్ర పొడవునా ప్రజలు భారీగా తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు తంటాలు పడ్డారు.. చివరకు మెరీనా బీచ్‌లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు..
కరుణానిధికి నివాళులర్పించిన ప్రధాని, రాహుల్‌..
అనారోగ్యంతో కన్నుమూసిన రాజకీయ కురువృద్ధుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి దేశ ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఉదయం 10.30గంటలకు చెన్నై ఎయిర్‌పోర్టుకు చేరుకున్న ప్రధానికి తమిళ సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్వీరు సెల్వంలు స్వాగతం పలికారు. అనంతరం నేరుగా కరుణానిధి పార్థివమృతదేహం ఉన్న రాజీజాహాల్‌కు చేరుకున్న ప్రధాని కరుణానిధి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళిని  పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా కరుణానిధి మృతదేహం వద్ద ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ నివాళులర్పించారు. ఢిల్లీ నుంచి చెన్నై చేరుకున్న రాహుల్‌.. రాజాజీ హాల్‌ వద్దకు చేరుకుని కరుణానిధి పార్థివదేహానికి అంజలి ఘటించారు. ఆయన కుమారుడు స్టాలిన్‌ను పరామర్శించారు. రాహుల్‌తో పాటు ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు తేజస్వీ యాదవ్‌ తదితరులు కరుణానిధికి నివాళులర్పించారు. అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు
నాయుడు రాజాజీహాల్‌ వద్ద కరుణానిధి పార్దీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం కనిమొళి, స్టాలిన్‌లను పరామర్శించి ధైర్యం చెప్పారు. అదేవిధంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కరుణానిధి మృతదేహానికి నివాళులర్పించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు నుండి ప్రత్యేక విమానం ద్వారా చెన్నై చేరుకున్న కేసీఆర్‌ అక్కడి నుండి నేరుగా రాజాజీహాల్‌కు చేరుకొని కరుణానిధి మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం స్టాలిన్‌, కనిమొళిని పరామర్శించారు. అదేవిధంగా కేరళ సీఎంతో పాటు జాతీయ స్థాయి నేతలు నివాళులర్పించారు. కరుణానిధి పార్దివదేహానికి తమిళన సినీ పరిశ్రమ నివాళులర్పించింది. రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, సూర్య, అజిత్‌, విశాల్‌, కుస్భూ, స్నేహాతో పాటు చిత్ర పరిశ్రమ ప్రముఖులు అభిమాన నేత కడసారి చూపుకు తరలివచ్చారు.
రాజాజీ హాల్‌ వద్ద తోపులాట..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మృతితో తమిళనాడు పెద్దదిక్కును కోల్పోయింది. తమ నేతను కడసారి చూసేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి అభిమానులు, డీఎంకే కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ప్రజల సందర్శనార్ధం కరుణానిధి పార్థివదేహాన్ని రాజాజీ హాల్‌లో ఉంచారు. అయితే ఉదయం నుంచి సంయమనంగా ఉన్న అభిమానులు.. మధ్యాహ్నం కాస్త అదుపుతప్పారు. కరుణకు నివాళులర్పించేందుకు వివిధ రంగాల ప్రముఖులు రావడంతో సామాన్యులకు అవకాశం రాలేదు. దీంతో కరుణను దగ్గరగా చూడాలని అభిమానులు చొచ్చుకుని వెళ్లేందుకు ప్రయత్నించారు. కొందరు బారికేడ్లు దాటుకుని కరుణ పార్థివదేహం వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జి చేశారు. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 26 మంది వరకు గాయపడ్డారు. రాజాజీ హాల్‌ సవిూపంలో ఉన్న ప్రజలను పోలీసులు చెదరగొట్టారు. హాల్‌ చుట్టూ భారీగా మోహరించారు. సవిూపంలోకి ఎవరూ రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కరుణ పార్థివదేహం ఉన్న ప్రాంతానికి ఎవరూ వెళ్లకుండా తలుపులు వేసేశారు. ఈ పరిణామాలపై కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ స్పందించారు. దయచేసి సంయమనం పాటించండి అని కార్యకర్తలను కోరారు. ఈ సందర్భంగా అంత్యక్రియలపై హైకోర్టు ఇచ్చిన తీర్పు గురించి కూడా స్టాలిన్‌ ప్రస్తావించారు. ‘మెరీనా బీచ్‌లో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వకుండా తమిళనాడు ప్రభుత్వం కరుణానిధి గౌరవాన్ని తక్కువ చేసింది. కరుణానిధిని చూసేందుకు విూరంతా ఇక్కడకు వచ్చారు. కొందరు గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. దయచేసి విూరు సంయమనం పాటించండి. పోలీసులు భద్రత కల్పించినా, కల్పించకపోయినా విూరు అంతిమయాత్రకు సహకరించండి. నెమ్మదిగా ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయండి అని స్టాలిన్‌ పార్టీ కార్యకర్తలను, అభిమానులను కోరారు.
కుమారుడికి చెప్పిన మాటలనే.. శవపేటికపై చెక్కించారు..
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి భౌతికకాయాన్ని సందర్శనార్థం చెన్నైలోని రాజాజీ హాల్‌లో ఉంచారు. ఆయన భౌతికకాయాన్ని ఉంచిన శవపేటికపై కుమారుడు స్టాలిన్‌కి చెప్పిన మాటలనే చెక్కించారు. 33 ఏళ్ల క్రితం కరుణానిధి.. స్టాలిన్‌కు ఓ మాట చెప్పారు. ‘మనం చనిపోయినప్పుడు ప్రజలు మన సమాధిని చూసి.. ‘విరామం లేకుండా పనిచేసిన వ్యక్తి విశ్రాంతి తీసుకుంటున్నారు’ అనేంతగా పేరు తెచ్చుకోవాలి అని చెప్పారట. ఈ విషయాన్ని స్టాలిన్‌ తన తండ్రికి రాసిన లేఖలోనూ ప్రస్తావించారు.
కరుణానిధి చెప్పిన ఆ మాటలనే ఆయన భౌతికకాయాన్ని ఉంచిన శవపేటిక చెక్కపై తమిళంలో
చెక్కించారు.
జయలలిత సమాధి పక్కనే..
వాళ్లిద్దరూ తమిళ రాజకీయాల్లో బద్ధ శత్రువులు. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శతృత్వం ఇద్దరి మధ్య ఉంది. అలాంటిది ఇప్పుడు ఆ జయలలిత సమాధి పక్కనే కరుణానిధి కూడా శాశ్వతంగా విశ్రాంతి తీసుకోబోతున్నారు. డీఎంకే పార్టీ దగ్గర ఉన్న  ప్లాన్‌ ప్రకారం కరుణానిధిని ఖననం చేసే చోటు ఆయన గురువు అన్నాదురై, జయలలిత సమాధుల మధ్య ఉంది. మొదట్లో మరీనా బీచ్‌లో కరుణానిధి ఖననానికి తమిళనాడు ప్రభుత్వం అంగీకరించని విషయం తెలిసిందే. దీంతో డీఎంకే మద్రాస్‌ హైకోర్టుకు వెళ్లి అనుమతి తెచ్చుకుంది. డీఎంకేకు చెందిన ఆరెస్‌ భారతి ఇచ్చిన ప్లాన్‌ ప్రకారమే ఖననం చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. తమిళ రాజకీయాల్లో కరుణానిధి, జయలలిత మధ్య దశాబ్దాల పాటు వైరం కొనసాగింది. ఇప్పుడు వైరిపక్షం అన్నాడీఎంకేనే అధికారంలో ఉండటం, మెరీనా బీచ్‌లో ఖననానికి అనుమతి ఇవ్వకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. గాంధీ మండపం దగ్గర ప్రత్యేకంగా రెండెకరాల స్థలం ఇస్తామని ప్రభుత్వం ప్రతిపాదించినా డీఎంకే అంగీకరించలేదు.
—————————-