కన్నీటి సంద్రంగా మిగిలిన సీమవరదల నుంచి ఇంకా తేరుకోని వైనం

సహాయక చర్యల్లో మరింత వేగం పెంచాలి

బాధితులను ఆదుకునేందుకు ఉదారంగా వ్యవహరించాలి

కడప,నవంబర్‌ 23  (జనంసాక్షి) :  అసాధారణ రీతిలో కురిసిన వర్షాలు రాయలసీమను అతలాకుతలం చేశాయి. నాలుగు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలకు నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లడంతో ఊళ్లూ, యేళ్ళూ ఏకమయ్యాయి. కరువు సీమగా పేరుపడ్డ రాయలసీమలో ఇటువంటి వైపరీత్యాలు రావడం గత 60 ఏళ్ల చరిత్రలో ఇదే మొదటిసారి. వర్షాలు ఆగి రెండు రోజులైనా ఇప్పటికీ చాలా గ్రామాలు జలదిగ్బంధనంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ప్రజలు పడుతున్న అవస్థలు వర్ణనా తీతం. గత నాలుగు రోజుల్లో చిత్తూరులో నల్గురు, కడపలో 13 మంది, అనంతపురంలో ఏడుగురు మొత్తంగా 24 మంది చనిపోయారు. మరో 17 మంది జాడ తెలియరాలేదు. ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌, వైమానిక దళం, అగ్నిమాపక దళ సిబ్బంది రంగంలోకి దిగి 35 మందిని కాపాడారు. లేకుంటే ప్రాణనష్టం ఇంకా పెరిగి ఉండేది. ప్రాథమిక అంచనా ప్రకారం 2.3 లక్షల హెక్టార్లలో వ్యవసాయం, 0.19 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు దెబ్బతినిపోయాయి. సత్వర సాయం కోసం సిఎం జగన్‌ ఆదేశించినా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. సర్వస్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ప్రజలు సాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు. గ్రామాలకు గ్రామాలు వరద నీటిలో మునిగిపోవడంతో అనేకమంది అనాధులగా మిగిలారు. వందల సంఖ్యలో ఇళ్లు కొట్టుకుపోయాయి. జాతీయ రహదారులు, రైల్వే ట్రాక్‌లు వరద నీటి ఉధృతికి దెబ్బతినిపోయాయి. విద్యుత్‌, నీటి సరఫరా వ్యవస్థ స్తంభించిపోయింది. అపార ఆస్తి నష్టంతోబాటు ప్రాణ నష్టం కూడా చోటు చేసుకుంది.  వరద పూర్తిగా తగ్గితే కానీ ఆస్తి నష్టానికి సంబం ధించిన పూర్తి వివరాలు బయటకు రావు. రోడ్లు, విద్యుత్‌ స్తంభాలు, ఇతర మౌలిక సదుపాయాలకు భారీ గానే నష్టం వాటిలింది. విపత్తును  ముందుగానే పసిగట్టి తగు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని చాలా వరకు నివారించగలిగే వారు. భారీ వర్షాలకు చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురంలో చోటుచేసుకున్న కొన్ని విషాదకర ఘటనలకు ప్రకృతి వైఫల్యం కన్నా మానవ వైఫల్యమే కారణమని చెప్పాలి. చెరువులు, జలాశయాలను ఇష్టానుసారంగా ఆక్రమించేసుకుని, అక్కడ బహుళ అంతస్తుల భవంతులు కట్టడంతో ఏర్పడ్డ వైపరీత్యంగా భావించాలి.  టెంపుల్‌ టౌన్‌ తిరుపతి నాలుగు రోజుల వర్షాలకే జలాశయంగా మారిపోయింది. తిరుమల ఘాట్‌ రోడ్డు ఫుట్‌పాత్‌లు పలుచోట్ల కూలిపోవడం, శ్రీవారి మెట్లపై వరద నీరు జలపాతాన్ని తలపించింది. చెరువుల ఆక్రమణను నివారించడంలోను, డ్రైనేజీ వ్యవస్థను పటిష్ట పరచడంలోను ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. రాజంపేటలో అన్నమయ్య ప్రాజెక్టుకు గండి పడడం, తిరుపతి లోని రాయల చెరువు గట్టు ఏ క్షణమైనా తెగే పరిస్థితి రావడానికి వీటి నిర్వహణలో అలసత్వమే కారణమని చెప్పక తప్పదు. అనంతపురం జిల్లా కదిరిలో నిర్మాణంలో ఉన్న పలు అంతస్తుల భవనం కూలిపోవడానికి వర్షాలకు తోడు పురపాలక సంస్థ నిర్లక్ష్యం కూడా కారణం. వర్షాలు, వరదలతో తీవ్రంగా దెబ్బతిన్న చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో ఏరియల్‌ సర్వే జరిపిన ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి వర్ష మృతుల కుటుంబాలకు ప్రకటించిన రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఏమూలకూ అన్న విమర్శలు ఉన్నాయి. వరద బాధితుల కుటుంబాలను ఉదారంగా ఆదుకోవాలి. వరద బాధిత ప్రాంతాల్లో అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య పనులు యుద్ధప్రాతిపదిక న సాగాలి. వరద సాయం అందించడంలో కేంద్రం అనుసరిస్తున్న నిర్లక్ష్యాన్ని నిలదీయాలి.