కబ్జాకు గురైన ఆలయ భూమిని కాపాడాలంటూ.. జిల్లా కలెక్టర్ శరత్ కు ముచ్చర్ల గ్రామస్తుల వినతి
హత్నూర (జనం సాక్షి)
హత్నూర మండలంలోని ముచ్చర్ల గ్రామ శివారులో గల టిఎస్ఐఐసీ పరిధి సర్వే నెంబర్ 98,242లో ఆక్రమణకు గురవుతున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయ భూమిని కాపాడాలని కోరుతూ సోమవారం జిల్లా కలెక్టర్ శరత్ కు వినతి పత్రం అందజేసినట్లు ఆ గ్రామ పంచాయతీ పాలక వర్గం,ఎంపీటీసీ కిషన్ రావు తెలిపారు. పద్నాలుగేళ్ళ క్రితం ఇండస్ట్రియల్ పార్కు డెవలప్మెంట్ పేరిట రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన జీఓను అడ్డంపెట్టుకుని నిరుపేదలకు చెందిన అసైన్మెంట్ భూమిని ప్రభుత్వం సేకరించిందని అందులో పేర్కొన్నారు.లబ్దీదారులకు ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా సాగులో ఉన్న భూమిని సైతం తప్పుడు రికార్డులు సృష్టించి టిఎస్ఐఐసీ కి దారాదత్తం చేశారని వారు ఆరోపించారు.ప్రతి యేటా ఉత్సవ పూజలందుకున్న శ్రీ వెంకటేశ్వరస్వామి దేవాలయం భూమి కూడా అందులోనే ఆక్రమణకు గురైందని వారన్నారు.ఇప్పటికే ఎన్సీఎల్,వేకా పరిశ్రమల యాజమాన్యాలు అనుమతికి మించి భూమిని ఆక్రమించడమే గాకుండా టిఎస్ఐఐసీ నుండి పొందామని చెబుతూ మరో ఏడెకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారని వారు తెలిపారు.ఈ విషయం పలుమార్లు అధికారులు దృష్టికి తీసుకెళ్లిన స్పందించడం లేదని వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. భూ ఆక్రమణకు పాల్పడుతున్న ఎన్సీఎల్,వేకా పరిశ్రమల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా కబ్జాకు గురైన ఆలయ భూమిని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచి అనిత,ఉప సర్పంచి కృష్ణ,వార్డు సభ్యులు నాగరాజు,మహేందర్, పోచయ్య,గణేష్,దశరథ,దుర్గయ్య,కృ ష్ణ,అంజయ్య, రామకృష్ణ తదితరులు ఉన్నారు.