కరవు సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం


రైతులను ఆదుకోవడంలో నిర్లక్ష్యం
ప్రభుత్వ తీరుపై వామపక్షాల ఖండన
విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరశిస్తూ బంద్‌ నిర్వహిస్తున్న సిపిఎం, సిపిఐ నాయకులను అరెస్టు చేయడాన్ని వామపక్షాలు ఖండించాయి. ఈ మేరకు సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, సిపిఐ నాయకులు జల్లి విల్సన్‌,  ఒక ప్రకటన విడుదల చేశారు. కరువు ప్రాంతాల్లో సమస్యలు పరిష్కరించాలని, న్యాయం చేయాలని కోరిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణతోపాటు వందలాదిమంది నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయడం సరైంది కాదని తెలిపారు. ఉద్యమాలను అణచివేసే ధోరణిని ప్రభుత్వం మానుకోవాలని కోరారు. కరవు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చినందుకు అభినందించి, పరిష్కరించే ప్రయత్నాలు ఎందుకు చేయరని అన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కరువు సహాయక చర్యలు చేపట్టాలని సిఎం చంద్రబాబును కోరితే దేవుడిని అడగండని సలహా ఇచ్చాడని, అసలు ఆయనకు బాధ్యత ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే కరువు సహాయక చర్యలు చేపట్టేదాకా ఉద్యమిస్తామన్నారు. రాష్ట్రంలో కరువు సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైనందునే తాము  రోడ్డెక్కాల్సి వచ్చిందనీ, రైతులు ఆత్మహత్య బాటపట్టినా ప్రభుత్వానికి పట్టలేదనీ అన్నారు. తాగడానికి నీళ్ళులేక జనంతోపాటు పశువులు ఇబ్బందులు పడుతుంటే పట్టించుకోరా అని ప్రశ్నించారు. పైగా సిఎం చంద్రబాబు వ్యవసాయంపై విడుదల చేసిన శ్వేతపత్రంలోనూ కరువు సహాయక చర్యల ప్రస్తావన లేదన్నారు.రాష్ట్రంలో 347 మండలాలను కరువు కింద గుర్తించారనీ, 37 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు ప్రభుత్వమే లెక్కలు చెప్పిందనీ, కానీ రైతులకు జరిగిన నష్టాన్ని పారదర్శకంగా వేయలేదనీ అన్నారు. కేంద్రాన్ని కూడా రూ.1400 కోట్లు ఇవ్వాలని నివేదించారన్నారు. కరువు బారినపడి జనం అల్లాడుతుంటే ఎటువంటి చర్యలూ చేపట్టలేదన్నారు.