కరుణానిధికి అస్వస్థత

– మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌, జ్వరంతో బాధపడుతున్న కరుణానిది
– ఇంటివద్దనే చికిత్స అందిస్తున్న వైద్యులు
– కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై మోదీ ఆరా
– త్వరగా కోలుకోవాలని ట్వీట్‌ చేసిన మోదీ
– కరుణానిధి ఇంటికి భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు
చెన్నై, జులై27(జ‌నం సాక్షి) : డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరం, మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌తో ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో కరుణానిధి ఇంటి వద్దనే ఆయనకు వైద్యులు వైద్య సేవలు అందిస్తున్నారు. కాగా విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్రమోదీ ఫోన్లో  కరుణానిధిని పరామర్శించారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్‌కు ఫోన్‌ చేసిన మోదీ ఆయన ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. అనంతర ట్విట్టర్‌ ద్వారా విషయాన్ని వెల్లడించారు. కలైజ్ఞర్‌ కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు స్టాలిన్‌, కుమార్తె కనిమొళితో మాట్లాడానని, ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పానని, ఆయన త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ప్రార్థిస్తున్నా అంటూ మోదీ ట్వీట్‌ లో పేర్కొన్నారు. కరుణానిధి ఆరోగ్యం పరిస్థితి తెలుసుకున్న పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్దసంఖ్యలో ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. ఏడీఎంకే నేత వైగో, ఇతర నేతలు కరుణ నివాసానికి చేరుకుని పరామర్శించారు.
కరుణానిధి మూత్రనాళంలో ఇన్‌ఫెక్షన్‌తో పాటు జ్వరంతో బాధపడుతున్నారని గురువారం వైద్యులు తెలిపారు. ప్రస్తుతం గోపాలపురంలోని ఆయన నివాసంలో 24 గంటలపాటు ప్రత్యేక వైద్యసిబ్బందితో అనుక్షణం వైద్యసేవలు అందిస్తున్నారు. అనారోగ్యం దృష్ట్యా ఆయన్ని కలిసేందుకు ఎవరినీ అనుమతించవద్దని కుటుంబసభ్యులకు సూచించారు. అయితే తన తండ్రి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని.. ఎవరూ వదంతులు నమ్మొద్దని స్టాలిన్‌ కోరారు.