కరుణానిధిని పరామర్శించిన కేరళ సీఎం

– కరుణ.. పుట్టుకతోనే పోరాట యోధుడు
– ఆయన త్వరగా కోలుకోవాలనిప్రార్దిస్తున్నానన్న విజయన్‌
చెన్నై, ఆగస్టు2(జ‌నం సాక్షి) : అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని కేరళ సీఎం పినరయి విజయన్‌ గురువారం పరామర్శించారు. గురువారం ఉదయం చెన్నై చేరుకున్న విజయన్‌ నేరుగా కావేరీ ఆసుపత్రికి వెళ్లి కరుణానిధి కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి స్టాలిన్‌, కనిమొళిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విూడియాతో మాట్లాడిన విజయన్‌.. ‘కరుణానిధి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతోందని స్టాలిన్‌, కనిమొళి చెప్పారు. కరుణ.. పుట్టుకతోనే పోరాటయోధుడు. జీవితంలో ఎన్నో అంశాలపై ఆయన పోరాడారు. ఆయన సంకల్ప శక్తి చాలా గొప్పది’ అని కొనియాడారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.  అదేవిధంగా గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్న కరుణానిధి పరిస్థితి విషమించడంతో గత నెల 27న ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే. గత శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కరుణానిధి రక్తపోటు పడిపోవడంతో ఆయనను హుటాహుటిన నగరంలోని కావేరీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి ఆయన ఐసీయూలోనే ఉన్నారు. కరుణ ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆసుపత్రికి వెళ్లి ఆయనను పరామర్శించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సినీ నటులు అజిత్‌, విజయ్‌ తదితరులు కరుణానిధిని పరామర్శించారు.