కరుణానిధి మేరునగధీరుడు: మమత నివాళి

చెన్నై,ఆగస్టు 8(జ‌నం సాక్షి): కరుణానిధి దేశంలోనే ఓ సీనియర్‌ రాజకీయ వేత్త అని, ఆయన కుటుంబానికి బెంగాల్‌ సిఎం మమతా బెనర్జీ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కరుణానిధి అంత్యక్రియలు మెరీనా బీచ్‌లోనే నిర్వహంచుకునేందుకు మద్రాస్‌ హైకోర్టు అనుమతి ఇవ్వడం ఆహ్వానించదగ్గ పరిణామమని మమతా బెనర్జీ అన్నారు. మరోవైపు డీఎంకే అధినేత కరుణానిధిని కడసారి చూసేందుకు డీఎంకే కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున రాజాజీ హాల్‌కు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న అభిమానులను నియంత్రించడం పోలీసులకు ఇబ్బందిగా మారింది. జనం రద్దీ పెరగడం, అభిమానులు బారికేడ్లను తోసుకొని రావడంతో రాజాజీ హాల్‌లో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీంతో పోలీసులు లాఠీచార్జ్‌ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ తొక్కిసలాటలో ఇద్దరు మృతి చెందగా, 30 మందికి పైగా గాయాలయ్యాయి. ఈ సందర్భంగా డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ స్టాలిన్‌ మాట్లాడుతూ.. కార్యకర్తలు, ప్రజలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసిన విషయం విదితమే.