కరువు ప్రాంత రైతులను ఆదుకోవాలి: సిపిఎం

అనంతపురం ,జనవరి7(జ‌నంసాక్షి): జిల్లాలో అన్ని పంటలు దెబ్బతిన్నాయని, 63 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం గుర్తించిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్‌ అన్నారు. అయితే కరువు సహాయక చర్యలు తీసుకోవడంలో ఆలస్యం చేస్తోందన్నారు. జిల్లా రైతులకు వాతావరణ బీమాతో సంబంధం లేకుండా ఎకరాకు రూ.20 వేలు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వాలనిడిమాండ్‌ చేశారు. జన్మభూమి వేదికలో ప్రజల రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే రైతుల్ని రుణగ్రస్తులుగా మార్చేలా ఉన్నాయని అన్నారు. ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతావరణ బీమా, కొత్త పింఛన్లు, రేషన్‌ కార్డులు, ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం, జిల్లా మంత్రులు స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతుల్ని నవ్వించడానికి వచ్చినట్లు ఉందని అన్నారు. ముఖ్యమంత్రి ఒక స్పష్టమైన ప్రకటన చేయాల్సిన అవసరం ఉందన్నారు. వాతావరణ బీమాకు జిల్లా రైతులు రూ.182 కోట్లు చెల్లించారని తెలిపారు. అయితే ముఖ్యమంత్రి బుక్కపట్నం జన్మభూమి సభలో ఇన్‌పుట్‌ సబ్సిడీ, వాతారణ బీమా రెండు కలిపి ఎకరాకు రూ.6 వేలు ఇస్తామనడం అన్యాయమని అన్నారు. వాతావరణ బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీ వేర్వేరుగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. జిల్లాలో 80 వేల మందికి పింఛన్ల కోసం అర్హులు దరఖాస్తు చేసుకున్నారని, వారిలో 52 వేల మందికి మంజూరు చేసినట్లు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారని అన్నారు. జన్మభూమిలో ఎందుకు కొత్త పింఛన్లు పంపిణీ చేయలేదని ప్రశ్నించారు. కొత్త రేషన్‌ కార్డులు మంజూరు విషయంలో జన్మభూమి కమిటీ సిఫార్సుల దారులకే మంజూరు చేస్తున్నారని ఇది సరికాదన్నారు. జన్మభూమి కమిటీ టిడిపి తమ కార్యకర్తలతో నియమించిన కమిటీనే అని అది రాజ్యాంగ కమిటీ కాదన్నారు. జన్మభూమి కమిటీ ద్వారా అవకతవకలు జరుగుతున్నాయని అన్నారు. జన్మభూమి కమిటీతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా, నిష్పక్షపాతంగా అర్హులందరికీ కొత్త రేషన్‌కార్డులు జారీ చేయాలని కోరారు. 7 మున్సిపాలిటీలలో చాలా మంది ఇళ్ల స్థలాలు వేసుకుని పట్టాలు లేకుండా జీవిస్తున్నారని వారందరికీ జన్మభూమిలోనే ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని డిమాండ్‌ చేశారు.