కరెంటు కష్టాలు తీరుతాయి : జైపాల్‌రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 7 (జనంసాక్షి):విద్యుత్‌ విషయంలో కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకుంటుందని కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందన్నారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడుతూ తనపై చేస్తున్న రాజకీయ ఆరో పణలకు స్పందించబోనన్నారు. ఆంధ్ర రాష్ట్రంపై తానెప్పుడూ వివక్ష చూపలేదన్నారు. తనపై అప వాదు మోపడం విచాకరమన్నారు. గ్యాస్‌ అంశంలో త్వరలో రాష్ట్రానికి ఊరట కలిగించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటుందన్నారు. తాను విద్యుత్‌ శాఖ మంత్రిని కాదన్నారు. అయినప్పటికీ రాష్ట్రానికి మేలు చేకూర్చేందుకు పాటుపడతానన్నారు. ఇప్పటికే సంబంధిత మంత్రులతో సంప్రదింపులు జరిపానన్నారు. 2008లో రిలయన్స్‌ను రత్నగిరికి తరలించడం వెనుక తన ప్రమేయం ఏమీ లేదన్నారు. ఆ విషయంలో తాను నిమిత్తమాత్రుడినని అన్నారు. విద్యుత్‌ కొరతతో అల్లాడుతున్న రాష్ట్రానికి అదనపు విద్యుత్‌ ఇవ్వడమా.. గ్యాస్‌ కోతను పునరుద్ధరించడమా అన్న విషయాల్లో ఏదొక దానిపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నదని చెప్పారు. ప్రధాని మన్మోహన్‌ను సిఎం కిరణ్‌కుమార్‌ రెడ్డి కలిసినందువల్ల మరిన్ని పథకాలు రాష్ట్రానికి అందే అవకాశం ఉంటుందని తెలిపారు.