కర్నాటక నేతల అత్యుత్సాహం

విషయం తెలుసుకోకుండానే వాజ్‌పేయికి సంతాపాలు

యెడ్యూరప్ప, నటుడు ఉపేంద్రల తీరుపై మండిపాటు

బెంగళూరు,ఆగస్ట్‌16(జ‌నం సాక్షి ): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బీహారీ వాజ్‌పేయిపై త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌ చేసిన ట్వీట్‌ మరువక ముందే బీజేపీకి చెందిన మరో సీనియర్‌ నేత ట్విటర్లో కలకలం రేపారు. వాజ్‌పేయి ఆరోగ్యం తీవ్రంగా విషమించిందనీ… ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని ఎయిమ్స్‌ వర్గాలు చెబుతున్న తరుణంలో ఆయన ఇక లేరంటూ కర్ణాటక ప్రతిపక్ష నేత, బిజెపికి చెందిన మాజీ సిఎం బీఎస్‌ యడ్యూరప్ప ట్విటర్లో ప్రకటించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ఆయన ట్వీట్‌ చేయడంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీంతో యడ్యూరప్ప హుటాహుటిన ట్విటర్లో నుంచి తన పోస్టును తొలగించినట్టు సమాచారం. కాగా వాజ్‌పేయి ఆరోగ్యం ఆందోళనకరంగా మారినట్టు తెలియడంతో దేశం నలుమూలల నుంచి పార్టీలకతీతంగా నేతలు ఎయిమ్స్‌కు తరలుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి ఎయిమ్స్‌కు వెళ్లి వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. యెడ్యూరప్ప బాటలోనే నటుడు ఉపేంద్ర కూడా సంతాపం ప్రకటించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో ఆయన్ని లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు ఎయిమ్స్‌ వైద్యులు తాజా హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించారు. అయితే వాజ్‌పేయి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించక ముందే ప్రముఖ కన్నడ సినీ నటుడు ఉపేంద్ర ఆయనకు శ్రద్దాంజలి ఘటించారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన భారతదేశానికి దక్కిన అత్యుత్తమ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి. ఆయనకి నా శ్రద్దాంజలి. మళ్లీ తిరిగి రండి అని ట్వీట్‌ చేశారు. అయితే వాజ్‌పేయి ఇంకా మృతి చెందలేదని, అప్పుడే శ్రద్దాంజలి ఎలా చెబుతారని నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడటంతో ఆయన కొంత సమయంలోనే ఆ ట్వీట్‌ని డిలీట్‌ చేశారు. ఉపేంద్ర మాత్రమే కాదు.. త్రిపుర గవర్నర్‌ తథాగత రాయ్‌, కర్ణాటక ప్రతిపక్ష నేత బీఎస్‌ యడ్యూరప్ప కూడా వాజ్‌పేయి ఇక లేరంటూ ట్వీట్‌ చేయడం దూమారం రేపింది.