కర్నాటక రాజకీయాల్లో మరోమారు సెగ

మళ్లీ సిఎంను అవుతానన్న సిద్దరామయ్య

బెంగళూరు,ఆగస్ట్‌25(జ‌నం సాక్షి): కర్నాటక రాజకీయాల్లో మాజీ సీఎం సిద్ధరామయ్య మరోసారి హీట్‌ పుట్టించారు. జనం ఆశీర్వాదముంటే మరోసారి తాను సీఎం అవుతానని చేసిన కామెంట్స్‌ కలకలం రేపుతున్నాయి. మరోవైపు రెబల్‌ ఎమ్మెల్యే ధనీష్‌ అలీ కూడా త్వరలో సీఎం పీఠంపై సిద్ధరామయ్య కూర్చోబోతున్నారంటూ కలకలం రేపారు. కుమారస్వామి సీఎంగా ఎన్నికైన నాటి నుంచి సిద్ధరామయ్య ఏదోరకంగా ఇబ్బందిపెడుతూనే ఉన్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్‌ తో కన్నడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఈ రకంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ నాయకుడు సిద్ధరామయ్య తన మనసులోని మాటను చెప్పారు. కర్ణాటక ప్రజల ఆశీర్వాదం ఉంటే మళ్లీ ముఖ్యమంత్రిని అవుతానని హసన్‌లో జరిగిన సభలో సిద్ధరామయ్య పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనుకున్న సీట్లను గెలుచులేకపోయాము. కానీ విూ ఆశీర్వాదం ఉంటే మరోసారి కర్ణాటకకు సీఎంను అవుతానని చెప్పారు . జేడీయూతో చేతులు కలపడం వల్లే తాను సీఎం కాలేకపోయానని పేర్కొన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. అయినా ప్రజలతోనే ఉంటామని అన్నారు. రెండోసారి ముఖ్యమంత్రి పదవిలోకి రాకుండా తనను విపక్షాలు అడ్డుకున్నాయనీ.. రాజకీయాల్లోకి కులం, ధనం వచ్చి చేరాయని పేర్కొన్నారు. ప్రజలు మళ్లీ నన్ను ఆశీర్వదించి ముఖ్యమంత్రిని చేస్తారని ఆశిస్తున్నాను. దురదృష్టవశాత్తూ నేను ఓడి పోయాను. అయితే ఇదే ముగింపు కాదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సాధారణమే అని పేర్కొన్నారు. ఇటీవల కర్ణాటకలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ… మెజారిటీకి కొద్ది దూరంలో ఆగిపోయింది. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ బలపరీక్షలో ఓడిపోయింది. నాటకీయ పరిణామాల మధ్య కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీలు చేతులు కలిపి సీఎంగా కుమారస్వామికి పగ్గాలు అప్పగించాయి. ప్రస్తుతం కాంగ్రెస్‌ మద్దతుతో సాగుతున్న జెడిఎస్‌ దినదినగండగా నడుస్తోంది.

————–