కర్నూల్‌ బాలసాయి బాబా కన్నుమూత

– గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి

– 18ఏటనే కర్నూల్‌లో తొలి ఆశ్రమం

– మెడిసిన్‌, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన బాలసాయి

– పలు అవార్డులు సత్కరించిన విదేశాలు

– సంతాపం తెలిపిన పలువురు ప్రముఖులు

కర్నూల్‌, నవంబర్‌27(జ‌నంసాక్షి) : కర్నూలు బాలసాయిబాబా కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌ లోని విరించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుకు గురై మరణించినట్టు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాలు తీస్తూ పేరు తెచ్చుకున్న బాలసాయిబాబాపై అనేక అరోపణలు ఉన్నాయి. గుప్త నిధుల తవ్వకాలు, భూమిని ఆక్రమించారన్న ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ, తనదైన ప్రవచనాలతో భక్తులను ఆయన విశేషంగా ఆకట్టుకునేవారు. బాలసాయి మృతి వార్త విని ఆయన అనుచరులు కంటతడి పెట్టారు. ఆయన పేరిట కర్నూలు ప్రాంతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు సాగుతున్నాయి. తన 18వ ఏటనే కర్నూలు ప్రాంతంలో ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి వేలాది మంది భక్తులకు ఇలవేల్పుగా మారిన బాల సాయిబాబా మరణం, ఆయన భక్తులను తీవ్ర ఆవేదనలో ముంచెత్తింది. 1960 జనవరి 14న కర్నూలులో జన్మించిన బాలసాయి, చిన్నతనం నుంచే శ్రీ రమణ మహర్షి బోధనలతో ఆథ్యాత్మికత వైపు మళ్లినట్టు చెబుతుంటారు. మెడిసిన్‌, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన ఆయనకు నృత్య, గాత్ర కళల్లోనూ ప్రావీణ్యం ఉంది. తన 18వ ఏట ఆశ్రమాన్ని స్థాపించిన ఆయన బోధనల పట్ల ఎంతో మంది ఆకర్షియులయ్యారు. కర్నూలు ప్రాంతంలో పాఠశాలలు, రహదారులు వంటి మౌలిక వసతులు కల్పించడంలో నిధులిచ్చిన ఆయనకు డాక్టర్‌ ఆఫ్‌ డివైనిటీ (ఇటలీలోని గ్లోబల్‌ ఓపెన్‌ యూనివర్శిటీ), అంబాసిడర్‌ ఆఫ్‌ పీస్‌ (ఐరాస), హాననరీ డిగ్రీ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌

లాస్‌ (నెదర్లాండ్స్‌ గ్లోబల్‌ పీస్‌ వర్శిటీ), హానరరీ డిగ్రీ ఆఫ్‌ డాక్టర్‌ ఆఫ్‌ ఫిలాసఫీ (ఫ్రాన్స్‌, యూనివర్శిటీ ఆఫ్‌ లిబ్రీ డెస్‌ సైన్స్‌) గౌరవాలు దక్కాయి. రాయ్‌ పూర్‌ లోని కళింగ యూనివర్శిటీకి బాలసాయి వైస్‌ చాన్స్‌ లర్‌ గానూ విధులు నిర్వర్తించారు. ఇక ఆయన ఎంత ఆధ్యాత్మికవేత్తో, అన్ని వివాదాలూ ఆయన్ను చుట్టుముట్టాయి. అనంతపురంలో గుప్త నిధులను దక్కించుకున్నారన్నది ఆయనపై వచ్చిన తొలి ఆరోపణ.. ఆ డబ్బుతోనే ఆయన ఆశ్రమాలు స్థాపించాడని ఆరోపణలు వచ్చాయి. దీనిపై పోలీసు కేసులు కూడా ఉన్నాయి. గాల్లోంచి చిన్నచిన్న బంగారు ఆభరణాలను తీసి భక్తులకు ఇవ్వడం, చేతి నుంచి విభూది రాల్చడం, శివరాత్రి నాడు తన నోటి నుంచి శివలింగాన్ని బయటకు తీయడం వంటి పనులతో ఆయన భక్తులను ఆకట్టుకునేవారు. పలువురి స్థలాలను ఆయన అన్యాక్రాంతం చేశారన్న కేసులూ విచారణ దశలో ఉన్నాయి. వివాదాలు ఎన్ని ఉన్నప్పటికీ, ఆయన మృతి పట్ల పలువురు దిగ్భాంతిని, సంతాపాన్ని వెలిబుచ్చారు. ఇదిలా ఉంటే భక్తులు తనను దేవుడు అనుకుని వస్తే దైవాన్ని, తాను సోషలిస్టు, కమ్యునిస్టుననీ.. ఓ రకంగా చెప్పాలంటే కమ్యూనిస్టు దేవుడినని ప్రచారం చేసుకున్నారు. వేంకటేశ్వర స్వామి విూరు ఒకటేనా అని ప్రశ్నిస్తే.. ‘ఎప్పటికప్పుడు ఆర్చితీర్చే నేను ఎక్కువా.. బండ రూపంలో ఉండే ఆయన ఎక్కువా’ అని సమాధానం ఇచ్చి హిందువుల ఆగ్రహాన్ని చవిచూశారు. పుట్టపర్తి సాయిబాబాయే తనలా పేరు మార్చుకుని ఉండొచ్చుగా.. ఆయన గురించి కాకరకాయ కథలు ఎన్ని వచ్చాయో తెలుసు కదా.. అసలు ఆయన గురించి ఆయన దగ్గర ఉన్నవారి కంటే నాకే ఎక్కువ తెలుసంటూ ఒక సందర్భంలో వ్యాఖ్యానించారు. పెళ్లెందుకు చేసుకోలేదని అడిగితే నేను స్త్రీనా. పురుషుడినా.. నపుంసకుడినా.. అసలు పెళ్లంటూ ఉంటుందా అని ప్రశ్నించి నివ్వెరపరిచారు.