కలిసిమెలిసి ఉద్యమిస్తం : కేసీఆర్‌

 

 

హైదరాబాద్‌ : నవంబర్‌ 16,(జనంసాక్షి):

జేఏసీతో ఉన్న మా అభిప్రాయ భేదాలను పరిష్కరించుకున్నామని టీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు  స్పష్టం చేశారు. ఇక నుంచి కలిసిమెలిసి ఉద్యమిస్తామని చెప్పారు. కేసీఆర్‌, కోదండరామ్‌ మధ్య భేటీ ముగిసిన అనంతరం వారిద్దరు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ సాధించుకునే వరకు కలిసికట్టుగా పోరాడుతామని తెలిపారు. త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు సబ్‌ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. యాదించే స్థితి నుంచి శాసించే స్థితికి తెలంగాణ రావాలని కేసీఆర్‌ చెప్పారు. నవంబర్‌ 29న దీక్షా దివస్‌లో జేఏసీ పాల్గొంటుందని తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలకు హాజరవుతామని పేర్కొన్నారు. తెలంగాణపై సభను స్తంభింపచేస్తామని తేల్చిచెప్పారు. రాష్ట్రప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. చంద్రబాబు అవిశ్వాస తీర్మాణం పెడతారనే నమ్మకం లేదని చెప్పారు. ఈనెల 23న సూర్యపేటలో జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణకు కావాల్సింది చంద్రన్న రాజ్యం రాజన్న రాజ్యం కాదని తెలంగాణ రాజ్యం కావాలన్నారు. ఈ ప్రభుత్వం ప్రస్తుతం పతనం అంచున ఉందని చెప్పారు. ఏ క్షణాన్నయినా ప్రభుత్వం కూలడం ఖాయమన్నారు. పక్షం రోజుల్లో ప్రభుత్వం పడిపోయే అవకాశాలున్నట్లు చెప్పారు. మంత్రి గీతారెడ్డిపై కోదండరామ్‌ వ్యాఖ్యలను పక్కదోవ పట్టించి కుట్రలతో కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో సభను స్తంభింప చేస్తామని తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మాణం పెట్టే అవకాశాలు లేవన్నారు. జేఏసీతో కలిసి తెలంగాణపై పోరాటం చేస్తామని చెప్పారు. తెలంగాణపై ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తెలంగాణ ఇస్తామని ఢిల్లీకి రమ్మని మోసం చేశారన్నారు. తెలంగాణ కోసం టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలపడానికి సైతం ఒప్పుకున్నానని పేర్కొన్నారు. ఇంతన్నా ఎక్కువ చేయలేమని తెలిపారు. రాబోయే రోజుల్లో తెలంగాణపై మరిత ఉద్యమాలు చేసే అవకాశాలున్నట్లు చెప్పారు.