కలుషిత ఆహారంతిని..  విద్యార్థినులకు అస్వస్థత

– ఘటనపై ఆరా తీసిన కలెక్టర్‌ లక్ష్మీకాంతం
– విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశం
విజయవాడ, డిసెంబర్‌29(జ‌నంసాక్షి) : కృష్ణా జిల్లా తిరువూరులోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం -1లో కలుషితాహారం తిని 35 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. క్రిస్మస్‌ సెలవులకు ఇంటికి వెళ్లి వచ్చిన విద్యార్థినులకు శుక్రవారం రాత్రి 7గంటలకు రాగి జావ, గంట వ్యవధిలో కోడి మాంసంతో కూడిన ఆహారాన్ని హాస్టల్‌ నిర్వాహకులు అందజేశారు. అయితే, శుక్రవారం ఉదయం 10 మంది విద్యార్థినులు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, జ్వరంతో అస్వస్థతకు గురికాగా.. వారిని సిబ్బంది చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాఠశాలకు వెళ్లిన మరో 25మంది విద్యార్థినులూ అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 31మంది విద్యార్థినులకు చికిత్స అందించి తిరిగి హాస్టల్‌కు పంపివేశారు. మరో నలుగురు విద్యార్థినులకు ఇన్‌ పేషెంట్‌ వార్డులో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం ఈ ఘటనపై ఆరా తీశారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాల్సిందిగా తహశీల్దార్‌ బుల్లిబాబును ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థులంతా 5 నుంచి 7వ తరగతి చదువుతున్నవారే.