కలుషిత నీరు.చేపలు మృత్యువాత

రూ. 10 లక్షల నష్టం
తొర్రూరు:8జూలై (జనంసాక్షి )
క్వారీ యాజమాన్యాల నిర్లక్ష్యం మత్స్య కార్మికుల జీవనాధారాన్ని దెబ్బతీస్తోంది. వర్షం సాకుగా క్వారీ నిర్వాహకులు వ్యర్థ జలాలను చెరువులోకి వదలడంతో క్వింటాళ్ల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయి.
ఈ ఘటన  మండలంలోని కంటాయపాలెం పెద్ద చెరువులో చోటుచేసుకుంది.
మత్స్యకారులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని కంటాయపాలెం పెద్ద చెరువులో గత ఐదేళ్లుగా ప్రభుత్వం పంపిణీ చేసిన చేప పిల్లలను పెంచుతున్నారు.  ఒక్కో చేప ఐదు కిలోల నుంచి 10 కిలోల వరకు పెరిగింది.
అవి అమ్ముకొని ఒక్కో మత్స్యకారుడు జీవనోపాధి పొందుతున్నారు.  వారి జీవనోపాధిని క్వారీ యాజమాన్యాలు దెబ్బతీస్తున్నాయి.
చెరువు సమీపంలో రెండు క్వారీలు ఉన్నాయి. గ్రానైట్ బండలను పేల్చేందుకు  బాంబులు వినియోగిస్తుంటారు.  ఆ బాంబులు పేల్చిన తర్వాత వెలువడే రసాయన వ్యర్ధాలు నీటిలో కలుస్తున్నాయి.   వర్షాకాలంలో ఆ క్వారీల్లో రసాయనాలతో కూడిన కలుషిత నీరు భారీగా నిలుస్తుంది. సదరు నీటిని నిర్వాహకులు సమీప చెరువులోకి వదులుతున్నారు.  దీంతో చెరువులోనే క్వింటాళ్లకొద్దీ చేపలని మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో వందలాది మంది మత్స్యకారులు జీవనోపాధిని వారి నిర్వాహకులు దెబ్బ కొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
చే రువులో భారీగా చేపలు మృతి చెందాయి.. అయితే క్వారీలు వదిలిన కలుషిత నీటితో చేపలు మృతి చెందాయని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు.  పెద్ద ఎత్తున చేపలు చనిపోయి నీటిపై తేలియాడుతూ ఒడ్డుకు కొట్టుకు రావడంతో మత్స్యకారులు కన్నీరు మున్నీరయ్యారు.
కంటికి రెప్పలా కాపాడుకున్న చేపలు.. అమ్ముకునే సమయంలో మృత్యువాత పడటంతో ఆం దోళనకు గురయ్యారు.
గ్రామ మత్స్య సొసైటీ అధ్యక్షుడు చుక్కల వెంకన్న కార్యదర్శి పేరబోయిన వెంకన్న,  మాజీ ఎంపీటీసీ మోకాటి వెంకన్న లు మాట్లాడుతూ….. చెరువు సమీపంలోని రెండు క్వారీలు వదులుతున్న కలుషితనీటి వల్లే పది టన్నుల చేపలు మృతి చెందాయని తెలిపారు.
తమకు దాదాపు రూ.10 లక్షల నష్టం వాటిల్లిందని తెలిపారు.
అధికారుల అనుమతి లేకుండా కలుషిత రసాయన నీటిని చెరువులోకి వదులున్న క్వారీల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరారు.చేపల మృతిపై మత్స్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తూరు రమేష్ చెరువును సందర్శించి మాట్లాడుతూ సుమారు రూ. 10 లక్షల విలువగల చేపల మృతికి కారకులైన గ్రానైట్ యాజమాన్యపై చర్యలు తీసుకొని నష్టపోయిన మత్స్యకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ నష్టపరిహారాన్ని అంచనా వేసి ఆదుకోవాలని కోరారు. చెరువును సందర్శించిన స్థానిక మత్స్యకారులు రామచంద్రు, ఏకాంబరం, వీరయ్య, అశోక్, వీరభద్రం, శీను, వెంకన్న, రామ్మూర్తి, మల్లయ్య, రాజు, అబాకర్, రామ్మూర్తి తదితరులు ఉన్నారు.