కల్పన చావ్లాకు నివాళులర్పించిన మోదీ
వాషింగ్టన్: అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. ప్రఖ్యాత ఇండో అమెరికన్ వ్యోమగామి కల్పన చావ్లాకు నివాళులర్పించారు. ఆర్లింగ్టన్ నేషనల్ సెమెటెరీ వద్ద ఆమె సమాధిపై పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం అమరజవాన్ల స్మారక చిహ్నానికి ప్రధాని అంజలి ఘటించారు. కల్పన చావ్లా అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారత సంతతి మహిళ. ఆమె 2003లో అంతరిక్షం నుంచి కిందకు వస్తుండగా స్పేస్ షటిల్‌కు ప్రమాదం జరిగి మరణించిన సంగతి తెలిసిందే.
నివాళులర్పించిన అనంతరం స్పేస్ షటిల్ కొలంబియా మెమోరియల్ కార్యక్రమంలో మోదీ.. కల్పన చావ్లా భర్త, ఆమె కుటుంబసభ్యులను కలిసి మాట్లాడారు. కొందరు నాసా సీనియర్ అధికారులు, ఇండో అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్, ఆమె తండ్రిని కలిశారు. ప్రధాని మోదీతో పాటు అమెరికా డిఫెన్స్ సెక్రటరీ ఆష్టన్ కార్టర్, అమెరికాలో భారత రాయబారి అరుణ్ కె.సింగ్, విదేశాంగ శాఖ కార్యదర్శి ఎస్.జయశంకర్, భారత్‌లో అమెరికా రాయబారి రిచర్డ్ వర్మ తదితరులు పాల్గొన్నారు.
విదేశీ పర్యటనలో ఉన్న మోదీ స్విట్జర్లాండ్ పర్యటన ముగించుకుని అమెరికాకు వెళ్లారు. వాషింగ్టన్ డీసీలో మోదీకి ఘన స్వాగతం లభించింది. 3 రోజులు మోదీ అమెరికాలో పర్యటించనున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో కీలక చర్చలు జరపనున్నారు.