కళాశాలలో విషాద ఛాయలు

కరీంనగర్‌,మార్చి26  (జ‌నంసాక్షి) : అటు కళాశాలలో ఇటు విద్యార్థుల ఇళ్లలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. అప్పటి వరకు తమతో ఉండి వెళ్లిన విద్యార్థులు మృతి ప్రతిమ మెడికల్‌ కాలేజీలో తీవ్రు విషాదాన్ని నింపింది. బుధవారం జరగిని ప్రమాదంతో కాలేజీలో ఎవరిని కదిపినా వారి అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. అందరితో కలిసిపోయే  నలుగురు వైద్య విద్యార్థులు ప్రమాదంలో ఒకేసారి మృతి చెందడంతో ప్రతిమ వైద్య కళాశాలలో విషాదం అలముకుంది. తమ స్నేహితుల స్మృతులను తలచుకుంటూ విద్యార్థులంతా కన్నీరుమున్నీరయ్యారు. అధ్యాపకులు, సిబ్బంది, యాజమాన్యం విద్యార్థుల మృతికి సంతాపం ప్రకటించారు. పెగడపల్లికి చెందిన నాని తల్లిదండ్రులు, వరంగల్‌ జిల్లా పరకాల నుంచి నవకాంత్‌ కుటుంబ సభ్యులు రాత్రి వైద్య కళాశాలకు చేరుకున్నారు. తమ పిల్లలను తలచుకుంటూ వారు రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ప్రమాదంలో వరంగల్‌ జిల్లాకు పరకాలకు చెందిన జూనియర్‌ డాక్టర్‌ సిరంగి నవకాంత్‌(24) మృతి చెందడంతో స్థానికంగా విషాదం నెలకొంది. మృతుడు స్థానిక వైద్యుడు, బిజెపినేత  సిరంగి సంతోశ్‌కుమార్‌ ద్వితీయ కుమారుడు. 17 నెలల కిందనే సంతోశ్‌ భార్య డాక్టర్‌ మాధవి అనారోగ్యంతో మృతిచెందారు. ఎంఎస్‌(సర్జన్‌) చదువుతున్న సమయంలోనే ఆమె హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. కాలేయం దెబ్బతినడంతో సుమారు నెల రోజులపాటు వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ 2013 అక్టోబరు 11న ఆమె చనిపోయారు. సంతోశ్‌కుమార్‌ మాధవి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు రాజు సైతం ఎంబీబీఎస్‌ పూర్తిచేశారు. ద్వితీయ కుమారుడు సైతం ఎంబీబీఎస్‌ చదువుతూనే ఇప్పుడు మృతిచెందారు. ఊహించని ప్రమాదంతో సంతోష్‌కుమార్‌ కుటుంబ సభ్యులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం బోడుప్పల్‌లోని రాజశేఖర్‌ కాలనీకి చెందిన రాసూరి రాహుల్‌ (21), వరంగల్‌ జిల్లా పరకాల మార్కెట్‌ ప్రాంతానికి చెందిన సిరంగి నవకాంత్‌ (20), మహబూబ్‌నగర్‌ జిల్లా ఉప్పునుంతలకు చెందిన కేతావత్‌ మహేశ్‌ నాయక్‌ (21), కరీంనగర్‌ జిల్లా పెగడపల్లి మండలం దేవికొండ గ్రామానికి చెందిన గొర్రె నాని (22) ప్రతిమ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే ప్రయత్నంలో వీరు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురయ్యింది.  సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పొక్లెయిన్‌ తెప్పించి కారును బయటకు తీశారు. నుజ్జునుజ్జయిన కారులో మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా మారాయి.  తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వచ్చేవరకు అర్థరాత్రి దాటింది. పోస్టుమార్టమ్‌ అనంతరం మృతదేహాలను తరలించారు. ఆయా గ్రామాల్లో వారి అంత్యక్రియలు గురువార్‌ం నిర్వహించే ఏర్పాట్లు చేశారు.