కసబ్‌ను ఉరిని స్వాగతించిన బీజేపీ అఫ్జల్ గురు సంగతేంటి? అని ప్రశ్న త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్న కాంగ్రెస్
న్యూఢిల్లీ, నవంబర్ 21 :కసబ్‌కు ఉరిశిక్ష అమలు చేయడాన్ని బీజేపీ స్వాగతించింది. ఉరిశిక్ష అమలు చేయడం మంచిదేనని.. అయితే, శిక్షను విధించడంలో కొంత ఆలస్యం జరిగిందని వ్యాఖ్యానించింది. కసబ్ సంగతి సరే… మరీ పార్లమెంట్‌పై దాడి చేసిన అఫ్జల్ గురు సంగతేమిటని? ప్రశ్నించింది. ఉరిశిక్ష పడిన అఫ్జల్ గురు విషయంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నారని బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. కసబ్ లాగే అఫ్జల్ గురును ఉరి తీయాలని పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ డిమాండ్ చేశారు. బుధవారం వారు ఢిల్లీలో వేర్వేరుగా విూడియాతో మాట్లాడుతూ.. కసబ్ ఉరితీతను స్వాగతించారు. ‘ఆలస్యమైనప్పటికీ.. మంచి నిర్ణయం తీసుకున్నారు. ముంబై దాడుల్లో గాయపడిన వారికి నిజమైన ఉపశమనం ఇప్పుడు లభించింది. సరిహద్దు ప్రాంతాల్లో దాక్కున్న కసబ్ లాంటి ఉగ్రవాదులను మట్టుబెట్టినప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. ముంబై దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కసబ్ ఉరితీతతో నిజమైన నివాళి లభించింది’ అని హుస్సేన్ పేర్కొన్నారు. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన కేసులో అఫ్జల్‌గురుకు వెంటనే ఉరిశిక్ష అమలు చేసి.. ఉగ్రవాదులకు గట్టి హెచ్చరిక పంపించాలని డిమాండ్ చేశారు. ఉగ్రవాదులు భారత్‌పై దాడి చేసేందుకు భయపడేలా అఫ్జల్‌ను కూడా ఉరి తీయాలన్నారు. అఫ్జల్‌గురుకు కోర్టు విధించిన ఉరిశిక్షను తక్షణమే అమలు చేయాలని రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. 2001 డిసెంబర్ 13న పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో అఫ్జల్‌గురుకు సుప్రీంకోర్టు ఉరిశిక్ష విధించింది. అయితే, గురు క్షమాభిక్ష ప్రసాదించాలని రాష్ట్రపతికి విజ్ఞప్తి చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన పిటిషన్ రాష్ట్రపతి భవన్‌లో పెండింగ్‌లో ఉంది. కసబ్ ఉరితీత నేపత్యంలో.. గురు విషయంలోనూ ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని రవిశంకర్ ప్రసాద్ కోరారు. ‘ఉరిశిక్షను సవాలు చేస్తూ.. అఫ్జల్ గురు పిటిషన్, రివ్యూ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అయినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. పెండింగ్‌లో ఉన్న క్షమాభిక్ష పిటిషన్లను ప్రభుత్వం తక్షణమే తిరస్కరించి, ఉరిశిక్షను అమలు చేయాలని’ డిమాండ్ చేశారు. సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాదులకు కసబ్ ఉరితీత ఓ హెచ్చరిక అని బీజేపీ నేత ముక్తార్ అబ్బాస్ నక్వీ అన్నారు. వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్న వారికి శిక్ష తప్పదని హెచ్చరించారు.
మరోవైపు, అఫ్జల్ గురు ఉరితీతపై గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రభుత్వాన్ని నిలదీశారు. ‘ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్‌పై 2001లో దాడికి పాల్పడిన అఫ్జల్ గురు సంగతేంటి? కసబ్ కంటే ఉరిశిక్ష పడినా.. ఆయన విషయంలో ఎందుకు చర్యలు తీసుకోరు?’ అని ట్విటర్‌లో ప్రశ్నించారు. మోడీ విమర్శలపై కాంగ్రెస్ స్పందించింది. అఫ్జల్ గురు విషయంలోనూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుంటుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ పేర్కొన్నారు. ‘ఎట్టకేలకు కసబ్‌కు ఉరిశిక్ష అమలైంది. పాకిస్తాన్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారి అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. త్వరలోనే అఫ్జల్ గురు కేసు విషయంపైనా నిర్ణయం తీసుకుంటుంది’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.