కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో వైద్య శిబిరం


టేకులపల్లి, ఆగస్టు 1( జనం సాక్షి ): సులానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో సోమవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మండల వైద్యాధికారి డాక్టర్ విరుగు నరేష్ బాలికలకు వైద్య పరీక్ష చేశారు. 42 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు నిర్వహించి, తగు చికిత్సను అందించారు. జ్వరంతో బాధపడుతున్న ఆరుగురు విద్యార్థినులకు రక్త పరీక్షలు నిర్వహించారు. పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, ఈ సీజన్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో అపరిశుభ్రమైన ఆహారం, వీధుల్లోని ఆహారం తీసుకోవద్దని ఆహారం తీసుకునే ముందు మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత అత్యంత పరిశుభ్రంగా చేతులు కడుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని వైద్యాధికారి పిల్లలకు సూచించారు.కరోనా, మంకీఫాక్స్ ఈ సీజన్లో వచ్చే వ్యాధులు, కీటక జనిత వ్యాధులపై అవగాహన బాలికలకు కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రిన్సిపల్  సంతు, ఏఎన్ఎం పరంగిణి,సీతమ్మ, మజహరి రమేష్ బాబు  ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.