కాంగ్రెస్‌లో చేరుతున్న టిడిపి బ్యాచ్‌

ఒక్కొరొక్కరుగా చేరుతున్న నేతలు
ఇప్పటికే తుమ్మల,సీతా దయాకర్‌ల చేరిక
తరవాత జాబితాలో మైనంపల్లి తదితరులు
బిజెపిలో ఉన్న నేతలకూ గాలం
వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న రేవంత్‌
హైదరాబాద్‌,సెప్టెంబర్‌23(జనంసాక్షి): తెలంగాణా రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్‌ పార్టీ ఎవరూ ఊహించని విధంగా అడుగులు వేస్తోంది. అధికరా బిఆర్‌ఎస్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. పాత టిడిపి గ్రూపును చేర్చుకోవడంలో పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి వేగంగా పావులు కదుపుతున్నారు. పాతతరం టిడిపి నేతలు ఒక్కొరొక్కరుగా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఓ రకంగా చెప్పాలంటే టిడిపి బలగాన్ని కాంగ్రెస్‌లో కలిపేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. రేవంత్‌ చాలా దూరదృష్టితో పనిచేస్తున్నారు. ఖమ్మంలో బలమైన నాయకుడిగా ఉన్న తుమ్మల నాగేశ్వర రావును కాంగ్రెస్‌లోకి రప్పించారు. మహబూబ్‌నరగ్‌లో సీతా దయాకర్‌ రెడ్డిని చేర్చుకున్నారు. ఇప్పుడు మైనంపల్లి హన్మంతరావును కూడా
రప్పించే యత్నాల్లో ఉన్నారు. ఇప్పటిదాకా తెలంగాణలో ముక్కోణపు పోటీ ఉంటుందని  అంతా అనుకుంటూ వచ్చారు. కానీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ పొలిటికల్‌ గా పోలరైజేషన్‌ అవుతున్నట్లుగా సన్నివేశం కనిపిస్తోంది. అధికార బీయారెస్‌ వ్యతిరేక ఓట్ల విూద ఆశలు పెట్టుకుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు నిలువునా కాంగ్రెస్‌ బీజేపీల మధ్యన చీలితే మరోసారి సులువుగా అధికారం దక్కించుకోవచ్చునని ఆ పార్టీ భావిస్తోంది. కానీ మొత్తం కాంగ్రెస్‌ చుట్టూ  రాజకీయం తిరుగుతోంది. అసలు తెలంగాణాలో బీజేపీ కీలకమైన శక్తి అన్నట్లుగా ఫోకస్‌ వచ్చినా అది కాస్తా బండిని తప్పించడంతో తుస్సుమంది.  కర్నాటక ఎన్నికల తరువాత సీన్‌ మొత్తం మారిపోయింది. కర్నాటకలో కనుక బీజేపీ గెలిచి ఉంటే ఎలా ఉండేదో కానీ అక్కడ ఓడి తెలంగాణాలో చూస్తే కమలం మెల్లగా వాడిపోతోంది. బండి సంజయ్‌ ని మార్చడంతో వర్గ పోరు ఒక వైపు ఉంది. సీనియర్‌ నేతల మధ్య అసలు పడడం లేదు. ఈ పరిణామాలు చాలవన్నట్లుగా ఇపుడు బీజేపీలో ఉన్న సీనియర్ల చూపు టీ కాంగ్రెస్‌ విూద పడిరది అని అంటున్నారు. బీఆర్‌ఎస్‌ను  ని గద్దె దించాలీ అంటే ధీటైన పార్టీగా కాంగ్రెస్‌ మాత్రమే ఉంటుందని తెలంగాణా బీజేపీ నేతలు కొందరు నమ్ముతున్నారు. మాజీ ఎంపీలు ఇటీవల కలసి దీని విూద చర్చించారని బాంబు లాంటి వార్త అయితే ఇపుడు ప్రచారం అవుతోంది. తెలంగాణాలో కెసిఆర్‌ను గద్దె  దించడం ప్రధానం అనుకుంటూ వస్తున్న బీజేపీ నేతలు ఆ పని కమలం పార్టీలో ఉంటే అసలు సాకారం కాదని గ్రహించి మెల్లగా హస్తం గూటికి చేరాలని చూస్తున్నారు.  ఈ విషయం విూద ఇప్పటికే అనేకసార్లు బీజేపీలో ఉన్న మాజీ ఎంపీలు సమావేశం అయ్యారని ప్రచారం సాగుతోంది. వీరంతా తమలో తాము చర్చించుకోవడమే కాకుండా కాంగ్రెస్‌ నేతలతో కూడా టచ్‌ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. కాంగ్రెస్‌ నుంచి కనుక స్పష్టమైన హావిూ ఒకటి లభిస్తే  సీనియర్‌ నేతలతో పాటు చాలా మంది బీజేపీ నుంచి వెళ్ళి హస్తం పార్టీలో చేరిపోతారని టాక్‌. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బిఆర్‌ఎస్‌కు చెక్‌ పెట్టాలని కూడా చూస్తున్నారు.  ఆ పని బీజేపీ వల్ల కాదు అని తేలిపోయిన క్రమంలో ఆ పార్టీలో ఇంకా తాము ఉంటే మరోసారి కెసిఆర్‌  అధికారంలోకి వస్తుందని కూడా లెక్కలేసుకుంటున్నారు. అందుకే ఓట్ల చీలికకు అసలు అవకాశం ఇవ్వకుండా చేయాలంటే కాంగ్రెస్‌ ని బలోపేతం చేయాలని వారు డిసైడ్‌ అయినట్లుగా తెలుస్తోంది. ఇది నిజంగా బీజేపీకి షాకింగ్‌ పరిణామం అని చెప్పాలి. బీజేపీ నుంచి బిగ్‌ షాట్స్‌ ఇలా ఆలోచిస్తూంటే కాంగ్రెస్‌ కనుక వారిని రమ్మని ఆహ్వానిస్తే మెజారిటీ నాయకులు బీజేపీ నుంచి జంప్‌ అవుతారు అని అంటున్నారు. అదే కనుక జరిగితే సరిగ్గా ఎన్నికల వేళ టీ బీజేపీ ఖాళీ అవుతుందా అన్న కొత్త చర్చ కూడా మొదలైంది.  రానున్న కొద్ది రోజులలో తెలంగాణాలో అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయని అంటున్నారు. ఇకపోతే  కొద్ది రోజులుగా మైనంపల్లి అధిష్ఖానంపై అలకబూనారు. తన కొడుకుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇవ్వలేదని గుస్సా అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మైనంపల్లి మల్కాజ్‌గిరి, మెదక్‌ రెండు అసెంబ్లీ సీట్లు డిమాండ్‌ చేస్తున్నారు. కానీ బీఆర్‌ఎస్‌ మాత్రం ఒకటే టికెట్‌ కేటాయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.కొన్ని రోజుల క్రితం కూడా బీఆర్‌ఎస్‌ మెదక్‌ టికెట్‌ కోసం ప్రయత్నాలు చేసినట్లు తెలుస్తోంది. బీఆర్‌ఎస్‌ అధిష్ఠానం నుంచి సరైన నిర్ణయం రాకపోవడంతో పార్టీ మారేందుకు సిద్ధం అయ్యారు. తనకు కాంగ్రెస్‌ పార్టీనే సరైనదని మైనంపల్లి హన్మంతరావు భావించి ఆ పార్టీలో చేరేందుకు పచ్చజెండా ఊపారు. ఇటీవల కొంతమంది కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు ఆయనను తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించి నట్లు తెలుస్తోంది. పార్టీ మారితేనే తనకు, తన కొడుకుకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని భావించిన మైనంపల్లి కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇప్పటికే నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే
వేముల వీరేశం కూడా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఢల్లీి వెళ్లిన వేముల వీరేశం రేపు మల్లిఖార్జున ఖర్గే సమక్ష్యంలో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. మైనంపల్లి హన్మంతరావు కూడా బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతుండడంతో బీఆర్‌ఎస్‌కు ఈ రెండు నియోజకవర్గాలల్లో గెలుపు అవకాశాలు తక్కువేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా పాత టిడిపి దళాన్ని మెల్లగా కాంగ్రెస్‌ వైపు తిప్పుకోవడంలో రేవంత్‌ చర్యలు ఫలిస్తున్నాయి.