కాంగ్రెస్‌కు కుటుంబమే పార్టీ

ప్రియాంక రాకతో మరోమారు రుజువయ్యింది

మహారాష్ట్ర పార్టీ నేతలతో మోడీ వీడియా కాన్ఫరెన్స్‌

న్యూఢిల్లీ,జనవరి23 (జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ వాళ్లకు కుటుంబమే పార్టీ అని, కానీ బీజేపీలో అలాంటివి ఉండవని ప్రధాని మోడీ అన్నారు. ఒక వ్యక్తి కానీ, ఒక కుటుంబం కానీ ఏం కావాలనుకుంటుందో అన్న దానిపై తమ పార్టీలో నిర్ణయాలు ఉండవని మోదీ అన్నారు. మహారాష్ట్రలోని పార్టీ కార్యకర్తలతో ప్రధాని మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వాళ్లకు కుటుంబమే పార్టీ అని ఆయన విమర్శించారు. కానీ దానికి భిన్నమైంది బీజేపీ పార్టీ అని మోదీ అన్నారు. రాహుల్‌ గాంధీ చెల్లెలు ప్రియాంకా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న విషయం తెలిసిందే. ప్రియాంకాను యూపీ ఈస్ట్‌ ప్రాంతానికి కాంగ్రెస్‌ ఇంచార్జీగా నియమించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మోదీ విమర్శలు చేశారు. కానీ దేశంలో చాలా వరకు పార్టీలు ఒకే కుటుంబం చేతిలో ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్య సూత్రాలను పాటిస్తున్న ఏకైక పార్టీ బీజేపీ అని ప్రధాని అన్నారు. పార్టీ కార్యకర్తలతో బీజేపీని నిర్మించామని, దేశం కోసం ఈ పార్టీ అంకితమైందని, ప్రజాస్వామ్యం మన సంస్కృతిలో భాగమని అన్నారు.