కాంగ్రెస్‌తో పొత్తు మంచిది కాదు
– తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి
అమరావతి, ఆగస్టు28(జనం సాక్షి) : ఏపీలో కాంగ్రెస్‌తో టీడీపీ పొత్తు మంచిది కాదని తెదేపా ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. అటు తెలంగాణ, ఇటు ఆంధప్రదేశ్ రాష్ట్రాల్లో పొత్తుల ఉహాగానాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన అమరావతిలో సీఎం చంద్రబాబును కలిసిన ఆయన పలు విషయాలపై చర్చించారు. అనంతరం విూడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉందని, కాంగ్రెస్ పార్టీ టీడీపీ మద్దతు కోరుతోందని, రాష్ట్రాన్ని దెబ్బ తీయడంలో అందరి పాత్ర ఉన్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్‌కి మద్దతు ఇస్తే తప్పు లేదని జేసీ అన్నారు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితిలో టీడీపీ లేదని, ఆంధ్రాలో మాత్రం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడం మంచిది కాదన్నారు. తెలంగాణలో పొత్తును ఏపీ ప్రజలు హర్షిస్తారని, కానీ ఏపీలో అవసరం లేదని, నమ్మిన వాడు ఎప్పుడు చెడిపోడని జేసీ అన్నారు. బీజేపీని నమ్మి మోసపోయామని, అధికారంలోకి వస్తే ఏపీకి న్యాయం చేస్తామని కాంగ్రెస్ అంటోందని, కాంగ్రెస్‌ని నమ్మి చూస్తే తప్పేవిూ ఉందంటూ… జేసీ వ్యాఖ్యానించారు. అలాగే విభజన పాపం కాంగ్రెస్, టీడీపీల రెండింటిది ఉందని, పొత్తుల విషయంలో ఎన్టీఆర్ నాటి పరిస్థితులు వేరు, ప్రస్తుత పరిస్థితులు వేరు అని దివాకర్‌రెడ్డి అన్నారు. ముందస్తు ఎన్నికలకు పోవడం కేసీఆర్ రాజకీయ కుయుక్తి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో టీఆర్‌ఎస్ పొత్తు ఉంటుందని, అయితే… ముస్లింలు దూరం అవుతారనే అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తుకు వెళుతున్నాడన్నారు. కేంద్రంలో అధికారం మారితేనే పోరాటాలకు ఫలితం ఉంటుందన్నారు.