కాంగ్రెస్ అధిష్టానానికి టీ ఎంపీల అల్టిమేటం
హైదరాబాద్, నవంబర్ 25 (జనంసాక్షి) :
డిసెంబర్ 9లోగా తెలంగాణపై ప్రకటన చేయకుంటే కీలక నిర్ణయం తీసుకుంటామని ఆ ప్రాంత ఎంపీలు స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని మందా జగన్నాథం నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశానికి నిజామాబాద్ ఎంపీ మధుయాష్కీ గౌడ్, వరంగల్ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, పెద్దపల్లి ఎంపీ డాక్టర్ జి. వివేకానంద, రాజ్యసభ మాజీ సభ్యుడు కె. కేశవరావు హాజరయ్యారు. ఈ భేటీలో ఎంపీలు పలు కీలక అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మందా జగన్నాథం సమావేశంలో చర్చించిన వివరాలు వెల్లడించారు. తెలంగాణవాదం లేదంటున్న ఆంధ్ర ప్రాంత నేతలకు సూర్యాపేట సభకు తరలివచ్చిన జనం కనిపిస్తున్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పాటు తప్ప తమకు వేరే ప్రత్యామ్నాయం లేదని ఇదే విషయం ఇప్పటికే పలుమార్లు అధిష్టానానికి ఈ విషయం వెల్లడించామని తెలిపారు. 2009లో తెలంగాణపై ప్రకటన చేసిన డిసెంబర్ తొమ్మిదినే మళ్లీ డెడ్‌లైన్‌గా విధిస్తున్నామని ఆ లోగా స్పందించకుంటే పార్టీని వీడేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టం చేశారు. సూర్యాపేటలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సమరభేరి సభ కొనసాగుతుండగానే టీ ఎంపీలు సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సూర్యాపేట వేదికగానే గులాబీ కండువా కప్పుకోవాలని ఇప్పటికే కొందరు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం కాగా అధిష్టానానికి చివరిసారిగా విజ్ఞప్తి చేసి నిర్ణయం తీసుకుంటే తమ విశ్వసనీయత పెరుగుతుందనే ఆలోచనతో వారు సమావేశమైనట్లు తెలిసింది. పార్టీ పెద్దలు స్పందించకుంటే పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్ బలం పెరగడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.