కాంగ్రెస్‌ కండువా కప్పుకున్న బైరెడ్డి 

– పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్‌ గాంధీ
– 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యం – బైరెడ్డి
న్యూఢిల్లీ, జులై21(జ‌నం సాక్షి) : రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో శనివారం బైరెడ్డి కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా బైరెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్‌ పార్టీలోకి రాహుల్‌ సాదరంగా ఆహ్వానించారు. కర్నూల్‌లో త్వరలో కాంగ్రెస్‌ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సభకు రాహుల్‌ గాంధీని ఆహ్వానించామన్నారు. ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ.. బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రానున్న ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా బీజేపీకి 50 సీట్ల కంటే ఎక్కువ రావని ఆయన జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ వైపే దేశ ప్రజలు చూస్తున్నారని చెప్పుకొచ్చారు. యువరాజు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ అధికారంలోకి ఖాయమని బైరెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌తోనే ఏపీకి ప్రత్యేక ¬దా సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. 2019 ఎన్నికలే మా లక్ష్యమని బైరెడ్డి చెప్పుకొచ్చారు. అయితే.. బైరెడ్డికి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏ పదవి అప్పగించబోతోంది.. ? బైరెడ్డి ఏం ఆశించి కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు? అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా బైరెడ్డి కాంగ్రెస్‌లో చేరికలో కోట్ల కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.