కాంగ్రెస్‌ నేతల తీరుతోనే జలాల తరలింపు

ఎలిగేడు, న్యూస్‌టుడే: జిల్లాలోని కాంగ్రెస్‌ నేతల అసమర్థతతోనే శ్రీరాంసాగర్‌ జలాలను మంత్రి పదవిని అడ్డుపెట్టుకుని సొంత జిల్లాకు అక్రమంగా తరలిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు విజయరమణారావు ఆరోపించారు. బుధవారం సాయంత్రం లాలపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో 5. 60లక్షల ఎకరాలు ఎస్సారెస్పీ నీటిపై ఆధారపడి సాగు చేసుకుంటున్న రైతులకు ఖరీఫ్‌లో ఒక్క ఎకరానికి కూడా నీరు ఇవ్వలేదన్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా మంత్రి సుదర్శన్‌రెడ్డి నాలుగు టీఎంసీల నీటిని నిజమాబాద్‌జిల్లాకు తరలిస్తుంటే జిల్లా మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్సీలు చోద్యం చూస్తూ రైతులకు అన్యాయం చేశారాని ఆరోపించారు. ఆరు విడతల్లో రబీ పంటలకు సాగు నీరందించి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్‌ చేశారు. గురువారం నుంచి డి-86,డి-83 ప్రధాన కాల్వల ద్వారా విడుదలయ్యే ఎస్సారెస్పీ నీటిని వృథా చేయకుండా రైతులు చెరువులు, కుంటల్లో నింపి భూగర్భ జలాలను పెంచుకోవాలని కోరారు. రాజేశ్వరరెడ్డి, తిరుపతిగౌడ్‌, కొండయ్య, రమేష్‌బాబు, తిరుమల్‌రెడ్డి పాల్గొన్నారు.