కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసింది జగనే

– రహస్యంగా పొత్తుల పెట్టుకోవాల్సిన అవసరం మాకులేదు

– ఓటమి భయంతోనే వైసీపీ ఇలా మాట్లాడుతుంది

– ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి

విజయవాడ, జనవరి24(జ‌నంసాక్షి) : కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసింది వైసీపీ అధినేత వైఎస్‌ జగనే అని పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రహస్య అవగాహనతో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం అంటూ వైసీపీ చేసిన వ్యాఖ్యలలో నిజం లేదన్నారు. వైసీపీ ఓటమి భయంతోనే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ద్రోహం చేసింది జగనే అన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలలో వైసీపీ నాయకులు బీజేపికి మద్దతు ఇచ్చారని రఘువీరా గుర్తు చేశారు. ఎంతకు అమ్ముడుపోయారని రఘువీరా జగన్‌ను ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దత్తు ఇచ్చినందుకు ఎంత సొమ్ము ముట్టిందో, రాబోయే ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎన్ని వేల కోట్లు ముట్టనున్నాయో తెలపాలని రఘువీరా రెడ్డి డిమాండ్‌ చేశారు. పార్టీ విధానాలను విమర్శించాలికాని బురద జల్లే ప్రయత్నం చేస్తే ఊరుకోం అని రఘువీరా రెడ్డి హెచ్చరించారు. వైసీపీ పార్టీ ఓ చిన్న పిచ్చుక అని, కాంగ్రెస్‌ జాతీయ పార్టీ అని అన్నారు. రాష్ట్ర ప్రజల అభిప్రాయాలు గౌరవిస్తామని, ప్రత్యేక ¬దా ఇస్తామని రాహుల్‌ చెబితే వైసీపీ నమ్మదట, ¬దా ఇవ్వమని చెప్పిన బీజేపీని మాత్రం వైసీపీ నమ్ముతానంటుందని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీకి రిమోట్‌ కంట్రోల్‌ ప్రధాని మోడీ అని పేర్కొన్నారు. రాహుల్‌ ద్వారానే ప్రత్యేక¬దా సాధ్యమని చంద్రబాబు గుర్తించారన్నారు. ప్రత్యక్ష రాజకీయాలలో ప్రియాంకా గాంధీ రావడం సంతోషం అని రఘువీరా తెలిపారు. ఇప్పటికే రాహుల్‌ ప్రతిభతో పార్టీ బలోపేతం అవుతుందని, రాహుల్‌కు తోడు ప్రియాంకాగాంధీ రావటంతో రాబోయే కాలంలో పార్టీ దేశంలో అధికారంలోకి రావటం ఖాయమన్నారు.