కాంగ్రెస్‌ హావిూలు ఇస్తే.. 

మాపై అవిశ్వాసమా?
– కాంగ్రెస్‌కు దగ్గరగా జరగడంతోనే తెదేపా సభ్యులు శాపగ్రస్తులయ్యారు
– కాంగ్రెస్‌ది స్కాముల ప్రభుత్వం..
– భాజపాది  స్కీముల ప్రభుత్వం
– పార్లమెంట్‌లో భాజపా ఎంపీ రాకేశ్‌ సింగ్‌
న్యూఢిల్లీ, జులై20(జ‌నం సాక్షి) : విభజన సమయంలో కాంగ్రెస్‌ పార్టీ హావిూలు ఇస్తే… ఇప్పుడు ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడమేమిటని భాజపా ఎంపీ రాకేశ్‌ సింగ్‌ ప్రశ్నించారు. తెదేపా ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన లోక్‌సభలో మాట్లాడారు. ప్రజాస్వామ్యం అంటే మా పార్టీ, ప్రభుత్వం అని కాదు. ప్రజలు ఎవరికి అధికారం కట్టబెడితే వారు పరిపాలన చేయడమే ప్రజాస్వామ్యం. భారతదేశాన్ని పరిణతి చెందిన ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం గుర్తించిందన్నారు. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తున్నామని గర్వంగా చెబుతున్నా అన్నారు. మిమ్మల్ని మోసం చేసిన కాంగ్రెస్‌తో కలిసి ముందుకెళ్తున్నారని,  కుమారస్వామి ప్రమాణస్వీకారంలో కాంగ్రెస్‌, తెదేపాల సాన్నిహిత్యాన్ని లోకం చూసిందన్నారు. కాంగ్రెస్‌కు దగ్గర కాగానే తెదేపా సభ్యులు శాపగ్రస్తులయ్యారన్నారు. కాంగ్రెస్‌తో కలిసిన తర్వాతే కర్ణాటక సీఎం కన్నీళ్లు పెట్టుకున్నారని, ఈ పరిణామాలను దేశమంతా చూస్తోందన్నారు. దేశ ప్రజల ఆశలు,  ఆకాంక్షలతో బలమైన ప్రభుత్వం ఏర్పడిందన్నారు. పరస్పర విరుద్ధమైన శక్తులు ఏకమై అవిశ్వాసం తీసుకొచ్చాయని రాకేశ్‌సింగ్‌ అన్నారు. ప్రజలు విశ్వసించిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీలు తెచ్చిన అవిశ్వాసం ఇదన్నారు. 2019లో నరేంద్ర మోదీ నాయకత్వంలో చేయబోయే విజయాత్రను అడ్డుకునే విఫలయత్నం ఇదన్నారు. దేశంలో, ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నాయకుడిపై అవిశ్వాసం పెడతారా అంటూ ప్రశ్నించారు. దేశంలో మొదటిసారిగా ఇంత మెజార్టీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడిదని, మోదీ
పారదర్శకమైన పాలన అందిస్తున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చాక 60 ఏళ్లపాటు కాంగ్రెస్‌ పార్టీయే దేశాన్ని పాలించిందన్నారు. 48ఏళ్లపాటు నెహ్రూ, ఇందిరా, రాజీవ్‌, మన్మోహన్‌ల నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం సాగిందన్నారు. పదేళ్ల పాటు మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం సాగింది సోనియా నేతృత్వంలోనే అని చెప్పడానికి వెనుకాడనన్నారు. కాంగ్రెస్‌ పాలనలో అన్నీ స్కామ్‌లేనని,  కుంభకోణాలతో దేశానికి మచ్చ తెచ్చాయని విమర్శించారు. గరీబీ హఠావో అన్నారు కానీ, పేదలను ప్రధాన జనజీవన స్రవంతి నుంచి తొలగించారన్నారు. ఓట్ల కోసం అంబేద్కర్‌ పేరును వాడుకున్నారని,  48ఏళ్ల స్కాముల ప్రభుత్వాలను 48 నెలల్లోనే స్కీముల ప్రభుత్వంగా మార్చామని రాకేశ్‌ పేర్కొన్నారు. అంచనాలు, వాస్తవికత మధ్య భేదం ఇప్పుడు తగ్గిందని, దేశ వనరులు పేదలకు సంబంధించినవని, మోదీ పథకాలతో పేదల ముఖాలపై చిరునవ్వులు కనిపిస్తున్నాయన్నారు. యూపీఏది మచ్చపడిన ప్రభుత్వం, మాది స్వచ్ఛ ప్రభుత్వమన్నారు. రెండు కోట్లమందికి పైగా పేదలకు ఇళ్లు కట్టించామని, ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా తీసుకొచ్చామన్నారు. దేశంలో పేదల ప్రభుత్వం బీజేపీనేనని అన్నారు.