కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలు తుస్‌

మహిళలకు బస్సు ప్రయాణం కూడా అనుమానమే
ఉద్యోగుల నాలుగు డిఎలపై మాట్లాడడం లేదు
ఎమ్మెల్సీగా రాకేశ్‌ రెడ్డిని గెలిపిస్తే మండలిలో కొట్లాడుతాం
హన్మకొండ సన్నాహక సభలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌ రావు
హనుమకొండ,మే 23 (జనంసాక్షి) : కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల్లో ఒకే ఒక హావిూ మాత్రమే అమలైందని సిద్దిపేట బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హావిూ కూడా తుస్సేనని ఎద్దేవా చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా హన్మకొండ జిల్లాలో ఏర్పాటు చేసిన పట్ట భద్రుల ఉప ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయ ఉద్యోగులకు నాలుగు డీఏలు ఇవ్వకుండా కాంగ్రెస్‌ మోసం చేసింది. అందుకోసం అసెంబ్లీ, కౌన్సిల్‌లో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా కలిసి పోరాడతాం. అందుకు ఎమ్మెల్సీగా రాకేశ్‌ రెడ్డిని గెలిపించాలని అన్నారు. నారాయణఖేడ్‌లో ఉపాధ్యాయులపై లాఠీఛార్జి చేసి కాంగ్రెస్‌ ప్రభుత్వం వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. నిరుద్యోగ భృతి హావిూపై నిలదీస్తే.. అలా చెప్పలేదని అసెంబ్లీలో భట్టి విక్రమార్క
అంటున్నారు. కరెంటు బిల్లులు, భూముల రిజిస్ట్రీషన్‌ ఫీజులు పెంచడానికి సిద్ధమవుతున్నారు. ఒక వైపు సంక్షేమానికి కోతలు.. మరో వైపు వాతలా? అన్ని వర్గాలను మోసం చేయడంతో రాష్ట్రంలో కాంగ్రెస్‌ పని అయిపోయింది. అందుకే పట్టభద్రుల ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెబితే కాంగ్రెస్‌ దారికొస్తుందని హరీశ్‌రావు అన్నారు. పట్ట భద్రుల సీట్‌ బీఆర్‌ఎస్‌ సొంతం చేసుకుంటుందని హరీష్‌ రావు అన్నారు. రాకేష్‌ రెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరూ ప్రచారం చేయాలి. ఎమ్మెల్యే స్థానంలో ఎమ్మెల్సీ గెలిపించాలి. కాంగ్రెస్‌ పాలనలోఉచిత బస్సు పథకం తప్ప అన్నీ తుస్‌. ఆరు గ్యారెంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. రైతాంగాన్ని నిలువునా మోసం చేసింది. ఇందిరమ్మ ఇల్లు, పింఛన్‌, అమలు చేసుడు విస్మరించింది. విద్యార్థి, నిరుద్యోగుల, ప్రభుత్వ ఉద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌ కు ఓటు తో బుద్ధి చెప్పాలి. ఉపాధ్యాయులపై నారాయణ ఖేడ్‌ లో లాఠీ ఛార్జి చేయడం సిగ్గు చేటు. వడ్లకు బోనస్‌ ఎగ్గొట్టిన కాంగ్రెస్‌ రైతు బిడ్డలు బుద్ధి చెప్పండి. సంక్షేమ పథకాలలో కోతలు, ధరలు పెంచి వాత పెడుతున్న రేవంత్‌ కు విద్యా వంతులు బుద్ధి చెప్పాలని ఆయన వ్యాఖ్యానించారు. తీన్మార్‌ మల్లన్న గొంతు ఎందుకు మూగబోయింది. ప్రశ్నించే గొంతు రాకేష్‌ రెడ్డికి పట్టభద్రులు ఓటు వేయాలి. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచిన బీజేపీ కి వాత పెట్టాలి. తెలంగాణ వాణి వినిపించాలంటే బీఆర్‌ఎస్‌ ను బలపర్చాలి. తెలంగాణ ఉద్యమ కార్లపై తుపాకీ ఎక్కు పెట్టిన రేవంత్‌ కు పట్ట భద్రులు ఓటు వేయొద్దు. హైదరాబాద్‌ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాలని కుట్రలు చేస్తున్న కాంగ్రెస్‌, బీజేపీ ప్రభుత్వంకు గుణపాఠం చెప్పాలని అన్నారు. తెలంగాణ నీళ్లు కర్ణాటక, తమిళనాడు రాష్టాల్రకు తరలించాలని బీజేపీ కుట్రలకు కాంగ్రెస్‌ వత్తాసు పలుకుతోంది. 2వేల పడకల ఆసుపత్రి చివరి దశకు వచ్చింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. తెలంగాణ చిహ్నం ను తొలగించాలని కుట్రలు చేస్తున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం లో పంటలు కోనేటోళ్ళు లేరు, కరెంట్‌ సరఫరాలో విఫలమయ్యారు. కాంగ్రెస్‌ అబద్దాలు, మోసాలను ప్రశ్నించడం రాకేష్‌ రెడ్డికి సాధ్యమని హరీష్‌ రావు పేర్కొన్నారు.