కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల గర్జన
చలో ‘విజయవాడ’ తో భారీ ధర్నా
సమస్యల పరిష్కరించాలని డిమాండ్
నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కరోజు సమ్మెకు హెచ్చరిక
విజయవాడ,ఆగస్ట్13(జనం సాక్షి): కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ సమస్యల్ని పరిష్కరించాలంటూ సోమవారం విజయవాడలోని అలంకార్ థియేటర్ వద్ద ‘చలో విజయవాడ’ ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా కొనసాగారు. ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి ఫ్యాప్టో ఛైర్మన్ పి.బాబురెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ సొసైటీలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, యూనివర్సిటీలలో దాదాపు 3 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా రెగ్యులర్ ఉద్యోగుల కంటే తక్కువ వేతనాలను చెల్లిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అనేక సౌకర్యాలు అమలు చేయడం లేదని, తమ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 15న రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె నిర్వహిస్తామని తెలిపారు. భవిష్యత్తులో మరింత పెద్ద ఎత్తున పోరాటాలకు ఉద్యోగులు సంసిద్ధం కావాలని పలుపునిచ్చారు. 10 పిఆర్‌సి అనంతరం గతంలోలానే రెగ్యులర్ ఉద్యోగుల బేసిక్‌తో సమానంగా వేతనాలను పెంచకుండా కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను 3 కేటగిరిలుగా విభజించి వేతనాలు తక్కువగా పెంచారన్నారు. ఉద్యోగులకు ఇస్తున్న వేతనాలను నెలనెలా చెల్లించడం లేదని తెలిపారు. కొంత మంది ప్రమాదాల్లో మరణించినా, వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నా, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచుతామని, రెగ్యులరైజ్ చేస్తామని ఎన్నికల మానిఫెస్టో లో టిడిపి ప్రకటించిందని పేర్కొన్నారు. 4 సంవత్సరాలు గడుస్తున్నా రెగ్యులరైజ్ చేయలేదని అన్నారు. ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు మా ఉద్యోగులు కారని కొంత మంది మంత్రులు, అధికారులు అనడం సరైనది కాదని చెప్పారు. చట్ట ప్రకారం ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యత ప్రధాన యజమానిగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. చట్ట ప్రకారం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సివిల్ అప్పీల్ 213 ఆఫ్ 2013 కేసులో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని తెలిపారు. 2/94 చట్టాన్ని సవరించి కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చెయ్యాలని, రెగ్యులరైజేషన్‌లోగా రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వేతనాలు, సౌకర్యాలు అమలు చేయాలని, మహిళలకు 180 రోజులు వేతనంతో కూడిన మెటర్నటీ లీవు సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. 11వ పిఆర్‌సిని ప్రారంభ తేదీ నుంచి వర్తింపచేయాలన్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఐఆర్ చెల్లించాలన్నారు. డిఏ, హెల్త్ కార్డులు, బస్‌పాస్ సౌకర్యాలు కల్పించాలని కోరారు. అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని, విధి నిర్వహణలో చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉపాధి కల్పించాలని చెప్పారు. 20 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రతి నెలా మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని కోరారు. పిఎఫ్, ఇఎస్‌ఐ లు సక్రమంగా అమలు చేయించాలన్నారు. విద్యారంగంలోని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంవత్సరంలో 12 నెలలకూ వేతనాలు చెల్లించాలని, సర్వశిక్షా అభియాన్‌లో గతంలోలానే కాంట్రాక్టు నియామకాలు మాత్రమే కొనసాగించాలని కోరారు. పార్ట్‌టైం ఉద్యోగులను ఫుల్ టైంగా మార్చాలని, నేషనల్ హెల్త్ మిషన్‌లో 35 క్యాజువల్ లీవులు అమలు చేయాలని కోరారు. ఒకే కేడర్-ఒకే వేతనం విధానాన్ని అమలు చేయాలని, పారా మెడికల్ సిబ్బందికి గతంలోలానే గ్రాస్ శాలరీ వర్తింపచేయాలన్నారు. జీఓల ప్రకారం పూర్తి వేతనాన్ని చెల్లించే పద్ధతిని అన్ని శాఖలలో అమలు చేయించాలన్నారు. నేడు నిర్వహించిన ర్యాలీ, ధర్నాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థలు, ప్రభుత్వ పథకాల నుంచి వేలాది మంది
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పాల్గొన్నారు.